తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్ధులకు సుప్రీంకోర్టు షాక్..

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన అభ్యర్ధులకు నిరాశ తప్పలేదు. రాష్ట్రంలో గ్రూప్1 పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ను వ్యతిరేకిస్తూ పలువురు అభ్యర్ధులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 

అయితే దీనిపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాగే దీనిపై మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వబోమని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పేసింది.

 

supreme court refuses to intervene in Telangana group 1 candidates petition against state

తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల విషయంలో గతంలో జారీ చేసిన జీవో 55 స్ధానంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో 29ను జారీ చేసింది. దీన్ని రద్దు చేయాలని కోరుతూ అభ్యర్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జీవో 29 రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలని కూడా కోరారు. అయితే ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జోక్యానికి నిరాకరించింది.

 

సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ నెల 27 వరకూ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. వీటి ద్వారా 563 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తోంది. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *