హైడ్రా నెక్స్ట్ టార్గెట్ అదే..! రంగనాధ్ కీలక ప్రకటన..!

హైడ్రా. తెలంగాణ రాజకీయాలు హైడ్రా చుట్టూ తిరుగుతున్నాయి. మూసీ పునరుజ్జీవం కోసం సీఎం రేవంత్ ప్రతిపాదనల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయంగా ఈ అంశంలో సవాళ్లు మొదలయ్యాయి. ఇదే సమయంలో హైడ్రా ఇప్పటి వరకు చేసిన కూల్చివేతలు.. ఇక చేపట్టనున్న కార్యాచరణ పైన కమిషనర్ రంగనాధ్ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేస్తామని స్పష్టం చేసారు.

 

రంగనాధ్ క్లారిటీ

హైడ్రా కమిషనర్ రంగనాధ్ కీలక ప్రకటన చేసారు. గత రెండు నెలల కాలంగా నగరంలో హైడ్రా కూల్చివేతల అంశం సంచలనంగా మారింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ కూల్చివేతల పైన చేసిన వ్యాఖ్యల పైన రంగనాధ్ స్పష్టత ఇచ్చారు. భవన నిర్మాణాలకు సంబంధించిన సంస్థల నుంచి అనుమతి తీసుకొని చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయమని వీ రంగనాథ్‌ ప్రకటించారు. ఇప్పటిదాకా హైడ్రా కూల్చేసిన నిర్మాణాలన్నీ అనుమతులు లేకుండా నిర్మించినవేనని చెప్పారు.

 

అందుకే కూల్చేసాం

చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ప్రజలు నివసిస్తోన్న భవనాల జోలికి వెళ్లమని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. చెరువుల పక్కనున్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుందని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురువుతున్నారని పేర్కొన్నారు. దుండిగల్‌, మల్లంపేట, అమీన్‌పూర్‌లో అనుమతులు ఇచ్చిన అనంతరం అవి ప్రభుత్వ స్థలాలని తెలిసి వాటిని రద్దు చేశారని, కానీ డెవలపర్లు నిర్మాణాలు చేపట్టి విక్రయించడంతో కూల్చివేశామని వివరించారు.

 

అనుమతులు ఇవ్వం

చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలకు ప్రభుత్వ విభాగాలు ఇకపై అనుమతులు ఇవ్వకుండా చూస్తామని, కొత్త నిర్మాణాలు రాకుండా నిఘా పెడతామని తెలిపారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ జరుగుతోందని, సమగ్ర వివరాల సేకరణ అనంతరం తదుపరి చర్యలుంటాయని రంగనాథ్‌ చెప్పారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో చెల్లుబాటయ్యే అనుమతులతో నిర్మిస్తోన్న భవనాలను ఇక నుంచి కూల్చేది లేదని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా చేపడుతోన్న నిర్మాణాల విషయంలో మాత్రం చట్ట ప్రకారం వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *