ఢిల్లీలో బాంబు పేలుడు.. సిఆర్‌పిఎఫ్ స్కూల్ వద్ద ఘటన..!

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం బాంబు పేలుడు ఘటన జరిగింది. ఉదయం దాదాపు 7.40 గంటల సమయానికి ఢిల్లీలోని రోహిణి జిల్లా ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఉన్న సిఆర్‌పిఎఫ్ స్కూల్ పరిసరాల్లో పేలుడు కారణంగా భారీ శబ్దం రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

 

ఢిల్లీ పోలీసులు బాంబు పేలుడుపై మాట్లాడుతూ తమకు ఉదయం దాదాపు 7.47 గంటలకు ఒక వ్యక్తి ఫోన్ చేసి బాంబు పేలుడు సంభవించినట్లు చెప్పాడని.. సెక్టార్ 14 రోహిణి ప్రాంతంలో ఘటన జరిగిందని తెలిపాడు అని అన్నారు. ”ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా ఒక స్కూల్ గోడ పేలుడు కారణంగా బీటలు వారింది. స్కూల్ పరిసరాల్లో అంతా బాంబు వాసన వస్తోంది. పేలుడు ప్రభావం వల్ల సమీపంలోని షాపుల కిటీకీలు, కార్ల అద్దాలు పగిలిపోయాయి. ఈ పేలుడుతో ఎంటు ప్రాణనష్టం జరగలేదు.” అని వివరించారు.

 

పేలుడు గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని చర్యలు చేపట్టింది. ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. “బాంబు పేలుడు ఘటన గురించి ఉదయం మాకు 7.50 సమయంలో సమాచారం అందింది. వెంటనే రెండు ఫైర్ బ్రిగేడ్ లు ఘటనా స్థలానికి తరలించాము. కానీ సిఆర్‌పిఎఫ్ స్కూల్ గోడలు, పరిసరాల్లో అదృష్టవశాత్తు పెద్దగా నష్టం జరగలేదు. ఇంకా పరిసరాలన్నింటినీ పరిశీలిస్తున్నాం.” అని అన్నారు.

 

అగ్నిమాపక సిబ్బందితో పాటు బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించింది. బాంబు పేలుడు కారణమేంటో ఇంకా స్పష్టత రాలేదు.

 

మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. వాయు కాలష్యం కొలమానం చూస్తే.. ఆదివారం ఉదయం 10 గంటలకు ఎయిర్ క్వాలిటీ కేవలం 265 ఉంది. ఢిల్లీలోని ముంద్కా ప్రాంతంలో 372 స్కోర్ ఉండగా.. ఆనంద్ విహార్ ప్రాంతంలో అత్యధిక (ఎయిర్ క్వాలిటీ 436) వాయు కాలుష్యం నమోదైంది.

 

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటెరాలజీ (ఐఐటిఎం) విభాగం అంచనా ప్రకారం.. కాలుష్యం ఇంకా తీవ్రమవుతుంది. రానున్న రోజుల్లో పంజాబ్, హర్యాణా ప్రాంతాల్లో రైతులు ఎండు గడ్డి కాల్చిడంతో దాని పొగ వల్ల గాలి మరింత కాలుష్యమవుతుంది.

 

ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని చెప్పడానికి ఉదాహరణగా.. యమున నది కనిపిస్తోంది. యమున నదిలోని నీటిపై దట్టమైన నురుగు ఏర్పడింది. పర్యావరణ నిపుణుల ప్రకారం.. నదిలో ఏర్పడిన దట్టమైన నురుగులో చాలా ఎక్కువ మోతాదులో అమ్మోనియా, ఫాస్‌ఫేట్ ఉంది. దీని వల్ల స్థానికులకు శ్వాస, చర్మ సంబంధిత తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది. ప్రభుత్వం వెంటనే నదిలో కాలుష్యం తగ్గించడానికి చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *