గ్రూప్ 1 అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు..

గ్రూప్ -1 పరీక్ష విషయంలో అపోహలను నమ్మొద్దు. కొందరు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రిజర్వేషన్లు సహా అన్ని నిబంధనలు పాటిస్తున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రూప్ 1 అభ్యర్థులు గత కొద్ది రోజులుగా ఆందోళనలు, నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో తాజాగా, సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేశారు.

 

కొన్ని పార్టీలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడాలనుకుంటున్నాయని వారు ఎలాంటి దుర్మార్గులో ఒకసారి నెమరువేసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. గతంలో అభ్యర్థులు ఏళ్ల తరబడి కోచింగ్‌ సెంటర్లు, లైబ్రరీల చుట్టూ తిరిగేవారని, వాయిదాల వల్ల విద్యార్థులు ఇతర ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. న్యాయస్థానాలు కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్ష విధానాన్ని సమర్థించాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

 

దయచేసి ఆందోళన విరమించి మెయిన్ పరీక్షకు హాజరుకావాలని లేదంటే బంగారు అవకాశాన్ని కోల్పోతారని సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్ 1 అభ్యర్థులకు సూచించారు. గ్రూప్ 1 పరీక్షలు సోమవారం జరుగుతున్నాయని చెప్పారు. కొందరు ఉద్యోగాలు పోయినవారు ఆందోళన చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు.

 

పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వని వారు ఇవాళ దగ్గరకు తీసుకొంటున్నారని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి విమర్శించారు. జీవో 55ప్రకారం భర్తీ చేస్తే ఎస్సీ,ఎస్టీ, బీసీ అభ్యర్థులు నష్టపోతారని అందుకే జీవో 29 తీసుకువచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే జీవో 29ని తీసుకొచ్చామని, ఇప్పుడు ఆందోళనలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు.

 

గత ప్రభుత్వంలో ఏనాడైనా విద్యార్థులను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. అభ్యర్థులపై లాఠీచార్జీ చేయవద్దని కేసులు పెట్టవద్దని పోలీసులకు సూచిస్తున్నట్లు స్పష్టం చేశారు సీఎం రేవంత్. మీ అన్నగా చెబుతున్నా.. ఆందోళనలు విరమించి.. గ్రూప్ 1 మెయిన్స్‌కు సిద్ధం కావాలని అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా, అక్టోబర్ 21 నుంచి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.

 

గ్రూప్ 1 అభ్యర్థుల డిమాండ్లపై 20న ప్రభుత్వ కీలక ప్రకటన

 

గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. గ్రూప్ 1 పరీక్షలు, జీవో 29 అంశం, గ్రూప్ 1 అభ్యర్థులు చేస్తున్న విజ్ఞప్తులు, అభ్యంతరాలు, వాటి సాధ్యాసాధ్యాలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చర్యలు ఉండాలని సూచించారు. ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గ్రూప్ 1 అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వం ఆదివారం ప్రకటన చేయనున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *