పార్టీ బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ కీలక అడుగులు..!

ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పక్క ప్లాన్ గా తన పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో జనసేన అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించారు. సీఎం చంద్రబాబు నాయుడును గత వైసిపి ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు తరలించగా.. పవన్ కళ్యాణ్ టిడిపికి మద్దతుగా నిలిచి బిజెపితో జతకట్టేలా పక్కా ప్లాన్ తో సక్సెస్ అయ్యారు. దాని ఫలితమే ఏపీలో జరిగిన ఎన్నికలలో 164 స్థానాలలో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.

 

అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా పాలనా పగ్గాలు చేపట్టిన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ బలోపేతమయ్యేందుకు పక్కా వ్యూహరచనతో.. పార్టీలోకి చేరికల పర్వానికి గేట్లు ఓపెన్ చేసినట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. గత నెల ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి, బాలినేని శ్రీనివాసరెడ్డి, తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. స్వయానా మాజీ సీఎం జగన్ కు బంధువైన బాలినేని జనసేన పార్టీలో చేరడం హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.

 

తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి దంపతులు జనసేన పార్టీలో చేరారు. వీరికి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అలాగే గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, జగ్గయ్యపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లు, పలువురు కోఆప్షన్ మెంబర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్ లు శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరారు.

 

ఓవైపు తెలుగుదేశం పార్టీ ఇటీవల ఎమ్మెల్యేల భేటీని నిర్వహించింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ.. తాము అధికారంలోకి వచ్చేందుకు టిడిపి క్యాడర్ ఎంతగానో శ్రమించారని, కార్యకర్తల శ్రమను ఎప్పటికీ మరువ వద్దంటూ ఎమ్మెల్యేలకు సూచించారు. అలాగే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఎమ్మెల్యేలు దృష్టి సారించాలన్నారు.

 

మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ క్యాడర్ విస్తరించేందుకు చేరికల పర్వానికి తెరలేపారు. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు జనసేన బాట పట్టగా.. యధేచ్చగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు పవన్ కళ్యాణ్. అసలే జమిలీ ఎన్నికలంటూ ప్రచారం సాగుతున్న వేళ.. పార్టీ క్యాడర్ ను పెంచుకొని, ఎన్నికల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు బలమైన క్యాడర్ ఉందని నిరూపించుకునేందుకు పవన్ ఆరాటపడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఏది ఏమైనా పక్కా ప్లాన్ ప్రకారం.. సైలెంట్ గా పార్టీ క్యాడర్ ను బలోపేతం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *