ఉచిత ఇసుక విధానంపై ప్రభుత్వం కీలక ప్రకటన..! ఇక పై

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తాజాగా రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. ఇప్పటికే నూతన మద్యం విధానం ప్రవేశపెట్టి మందుబాబుల కోరికలు తీర్చిన సీఎం చంద్రబాబు.. తాజాగా రాష్ట్ర ప్రజానీకానికి గుడ్ న్యూస్ చెప్పేశారు.

 

మొన్నటి వరకు ఇసుక అంటే బంగారంతో సమానంగా భావించేవారు ఏపీ ప్రజలు. కానీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం సమయంలో ఇసుక విధానంలో మార్పులు తీసుకొచ్చి, ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఉచిత ఇసుక విధానంపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసినా.. పలు విమర్శలను ఎదురుకోవాల్సి వచ్చింది.

 

తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఉచిత ఇసుక అంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అంతటితో ఆగక.. పలు జిల్లాలలో లారీ ఇసుకకు రూ.60 వేలు ఖర్చవుతుందని, మరికొన్ని జిల్లాలలో రూ.14 వేల నుండి రూ.16 వేల వరకు ఇసుక కోసం ప్రజలు డబ్బులు చెల్లిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఇసుక మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యమేలుతుందని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

 

అయితే సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం టిడిపి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉచిత ఇసుక విధానానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు చంద్రబాబు. సీఎం మాట్లాడుతూ ఇప్పటివరకు ఇసుక రీచుల నుండి ఉచితంగా ఇసుక తీసుకెళ్లే అవకాశం కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే ఉండేదని, తాజాగా ప్రభుత్వం ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రవాణా చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా సీనరేజ్ ఛార్జ్ వసూళ్లపై కూడా ప్రభుత్వం నుండి ప్రకటన విడుదలైంది. లారీలలో 40 టన్నులకు మించి ఇసుకను రవాణా చేసినా, అధిక లోడ్ జరిమానాలు ఉండవని ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.

 

దీనితో ఉచిత ఇసుక విధానంపై ప్రజలకు ఉన్న అపోహలు తొలగిపోయాయి. ఇసుక రీచ్ సమీపాన ఉన్న గ్రామాల ప్రజలకు ఇదొక మంచి శుభవార్తగా చెప్పవచ్చు. అంతేకాకుండా వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ధీటైన సమాధానమని కూటమి నేతలు తెలుపుతున్నారు. అలాగే ఉచిత ఇసుక ప్రకటనతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు అధికం కానున్నాయని చెప్పవచ్చు. గతంలో ఇసుకను తరలించుకునేందుకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టిన ఏపీ ప్రజలు, ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంపై చేసిన ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క ప్రకటనతో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చినట్లుగా ప్రజలు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *