ముంబై : కంగనా రనౌత్ సోదరి, ఫైర్‌బ్రాండ్ రంగోలి చందేల్ ట్విటర్ ఖాతాను అధికారులు తొలగించారు. ఓ వర్గాన్ని ఉద్ధేశించి రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోందని బాలీవుడ్ సెలబ్రిటీలు చేసిన ఆరోపణలపై స్పందించిన ట్విటర్ అధికారులు ఆమె అకౌంట్‌ను సస్పెండ్ చేశారు. కాగా బుధవారం ఉత్తర ప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్‌కు తరలిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్ధిష్ట వర్గానికి చెందిన వారిని, సెక్యూలర్ మీడియాను కాల్చి చంపాలని రంగోలి ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ కాస్తా వైరలవ్వడంతో రంగోలి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని దర్శకుడు రీమా కగ్టి, నటి కుబ్రా సైత్‌తోపాటు కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ సహా ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు. ఒక వర్గంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన రంగోలిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముంబై పోలీసులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ట్యాగ్ చేశారు. వీటిపై స్పందించిన ట్విటర్ అధికారులు వెంటనే రంగోలి అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. చివరికి రంగోలి అకౌంట్‌ను అధికారులు తొలగించడంతో ఫరాఖాన్‌తోపాటు తదితర నటులు ట్విటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.