న్యూఢిల్లీ : 2015 వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్‌లోనే నిష్ర్కమించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆనాటి సెమీ ఫైనల్లో భారత్ 95 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత ఆస్ట్రేలియా 328 పరుగులు చేస్తే, భారత జట్టు 233 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది. అప్పటి మ్యాచ్‌లో టీమిండియా ప్రధాన పేసర్ మహ్మద్ షమీ మోకాలి గాయంతోనే బౌలింగ్ చేశాడట. ఒకానొక సమయంలో నొప్పి భరించలేక ఫీల్డ్‌ను వదిలేసి వెళ్లిపోదామని అనుకుంటే ధోని వారించడంతో పూర్తి కోటా బౌలింగ్ వేయగలిగానన్నాడు. ‘ ఆ వరల్డ్‌కప్‌లో కొన్నిసార్లు మాకు ముఖ్యమైన మ్యాచ్‌లు ఎదురయ్యాయి. తొలి మ్యాచ్ నుంచి మోకాలి గాయం వేధించింది. కనీసం నడవానికి కూడా ఇబ్బంది పడేవాడ్ని. ఆ వరల్డ్‌కప్ అంతా పెయిన్‌కిల్లర్స్-ఇంజెక్షన్లతోనే బౌలింగ్ వేశా. మా ఫిజియో నితిన్ పటేల్ నాకు అండగా నిలిచారు. ఆ టోర్నమెంట్ ఆద్యంతం నాలో నమ్మకాన్ని నింపారు. నా మోకాలికి శస్త్ర చికిత్స జరిగితే గానీ తగ్గని నొప్పి అది. నా పిక్కలు- మోకాలు ఒకే సైజ్‌లో వాచిపోయాయి. అందుకోసం పెయిన్‌కిల్లర్స్ తీసుకుంటూనే టోర్నీ ఆడా. నా నొప్పిని తగ్గిస్తే నాకు ఆడటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పడంతో రెగ్యులర్‌గా పెయిన్‌కిల్లర్స్ వాడాల్సి వచ్చింది.
కానీ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు నొప్పిని భరించలేకపోయా. ఆ సమయంలో మేనేజ్‌మెంట్-కెప్టెన్ ధోనిలు నాపై నమ్మకం ఉంచారు. దాంతో మ్యాచ్‌కు సిద్ధమయ్యా. నా తొలి స్పెల్‌లో 13 పరుగులే ఇచ్చా. ఇక రెండో స్పెల్ వేసే సమయానికి నొప్పి ఎక్కువైంది. ధోని వద్దకు వెళ్లి నొప్పి భరించలేకపోతున్నానని చెప్పా. అప్పుడు నాలో ధోని ఆత్మవిశ్వాసాన్ని నింపే యత్నం చేశాడు. మొత్తం స్పెల్‌లో 60 పరుగుల కంటే ఎక్కువ ఇవ్వకుండా జాగ్రత్తగా బౌలింగ్ వేస్తే చాలన్నాడు. ఈ సమయంలో పార్ట్ టైల్ బౌలర్లతో బౌలింగ్ చేయించడం కరెక్ట్ కాదని ధోని చెప్పాడు. దాంతో కడవరకూ ఫీల్డ్‌లో ఉండి బౌలింగ్ చేశా. నాకు ధోని అండగా నిలవడంతో నా పూర్తి కోటా బౌలింగ్ వేయగలిగాను. అప్పుడు నేను చూసిన కష్టకాలం ఎప్పుడూ చూడలేదు. నా కెరీర్ అయిపోయిందనే అన్నారు. కానీ ఈరోజుకీ జట్టులో కొనసాగుతున్నా’ అని షమీ పేర్కొన్నాడు.