కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్‌సిబాల్ కేంద్రంపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. వలస కార్మికులు సరిహద్దు ప్రాంతాల్లో అల్లాడిపోతున్నారని , వారిపట్ల లాఠీచార్జ్ చేయడం సరైంది కాదన్నారు. ఎక్కడివారు అక్కడే ఉండాలంటూ బాషన్ (సుధీర్ఘ ప్రసంగాలు )ఇచ్చే బదులు వారికి అవసరమైన రేషన్, డబ్బు సహాయం అందించి ఈ కష్టకాలంలో వారికి తోడ్పాడునందించాలని అన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఎక్కడివారు అక్కడే ఉండాలన్న ప్రభుత్వ సూచనను పాటిస్తున్నప్పుడు, ప్రజల బాగోగులు చూసే బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు. ఇక 21 రోజుల లాక్‌డౌన్ కాస్తా మే3 వరకు ప్రకటించడంతో ముంబైలోని వలసకార్మికులు తమను స్వస్థలాలకు పంపాలంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయగా, పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కష్టకాలంలో వలస కార్మికులు, నిరుపేదలకు ఆహారం అందించేందుకు తమ వంతు కృషిచేస్తున్న వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలను కపిల్ సిబాల్ అభినందించారు.
గత 24 గంటల్లో 941 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 12,380కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. వీరిలో 10,477 ఆక్టివ్ కేసులుండగా, 1,489 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లోనే కరోనా కారణంగా 37 మంది మృత్యువాత పడ్డారు.దీంతో కరోనా మహమ్మారి కారణంగా చనిపోయిన వారి సంఖ్య 414కు చేరింది.