తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే..

తిరుపతి లడ్డుపై నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు ల్యాబ్ రిపోర్టు సంచలన విషయాలను వెల్లడించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగానే తిరుపతి లడ్డూలో గొడ్డు మాంసం ఉపయోగించినట్టు రిపోర్ట్ తెలిపింది. ల్యాబ్ రిపోర్టు ప్రకారం, శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉన్నట్టు తేలింది. అందులో ఫిష్ ఆయిల్, గొడ్డు కొవ్వు‌తోపాటు పంది!(Lard) కడుపులో ఉండే కొవ్వును కూడా ఉపయోగించినట్టు ఈ రిపోర్టు వెల్లడించింది.

 

తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లడ్డూ శాంపిళ్లను టెస్టింగ్ కోసం గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు పంపించారు. ఈ ల్యాబ్ శాంపిళ్లను పరీక్షించిన తర్వాత రిపోర్టు వెలువరించింది. తమకు అందిన శాంపిళ్లలో ఎస్‌ వ్యాల్యూ ఉండాల్సిన మోతాదులో లేదని వివరించింది. ఎస్ వ్యాల్యూ మోతాదులో లేదంటే అందులో వేరే కొవ్వు కలిసిందని అర్థం చేసుకోవాలని రిపోర్టు తెలిపింది.

 

లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యి కాకుండా బయట నుంచి కలిపిన కొవ్వుల వివరాలను ఈ రిపోర్టు వివరించింది. అందులో సోయా బీన్, సన్‌ఫ్లవర్, ఆలివ్, రాప్సీడ్, లిన్సీడ్, వెట్ జెమ్, మెయిజ్ జెమ్, కాటన్ సీడ్‌తోపాటు చేప నూనే ఉన్నదని పేర్కొంది. అలాగే.. కొబ్బరి నూనే, పామ్ కెర్నెట్ కొవ్వు ఉన్నదని తెలిపింది. పామాయిల్‌, గొడ్డు కొవ్వు, లార్డ్(పంది కొవ్వు!) ఉన్నదని ఈ ల్యాబ్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ రిపోర్టు గురించి టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణ మాట్లాడుతూ గత ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను గాయపరిచిందన్నారు. ప్రతి రోజూ శ్రీవారికి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారని, కానీ, అందులో గొడ్డు కొవ్వును కలపడమంటే ఎంత దారుణమని ఆగ్రహించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా అయ్యే నెయ్యిలో ఇవన్నీ కలిపారని పేర్కొన్నారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు నిజమని తేలాయని వివరించారు.

 

తిరుమలలోని శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వులు ఉపయోగించారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ ఆరోపణలను టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. తాము దేశీ ఆవు నెయ్యిని తెచ్చి తిరుపతి లడ్డూ తయారీలో ఉపయోగించామని వివరించారు. తాము దైవ సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమని, చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబం కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు సత్యమైనవేనని దైవంపై ప్రమాణం చేయగలడా? అని సవాల్ విసిరాడు. తాజాగా, సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను నిజం చేస్తూ ఈ ల్యాబ్ రిపోర్టు వెలువడింది.

 

ఈ రిపోర్టు వెలువడిన తర్వాత టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ జగన్ పై విరుచుకుపడింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పరమపవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూలో గొడ్డు మాసం, చేప నూనెలు, పంది కొవ్వు నుంచి తీసిన పదార్థాలను నెయ్యిగా వాడి ఏడుకొండల వెంకటేశ్వరస్వామికి తీరని అపచారం చేశారని మండిపడింది. కోట్లాది భక్తుల నమ్మకాన్ని, మనస్సులను గాయపరచారని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *