కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ఏర్పడింది–: హరీష్ రావు..

కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ఏర్పడిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మెదక్‌లో పర్యటించిన ఆయన, కాంగ్రెస్ అబద్దాలతో ప్రజలను నమ్మించి, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ 200 రూపాయల పింఛన్‌ను మొదటి నెలలోనే రూ.1000 కి పెంచారని, రెండోసారి అధికారంలోకి రాగానే 2,000 రూపాయలు చేశారని గుర్తు చేశారు. పది నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం 4000 రూపాయలు అందించలేకపోయిందని ఎద్దేవ చేశారు. గురుకులాల్లో పిల్లలు ఆగం అవుతున్నారని, పురుగుల అన్నం తినలేక రోడ్లపైకి వస్తున్నారని ఆరోపించారు. చేయాల్సిన పని చేతగాక, కేసీఆర్‌ని తిట్టడమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి మాటలు వింటే రాష్ట్రానికి మేలు చేస్తున్నాడా, కీడు చేస్తున్నాడా అర్థం కావడం లేదన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమంటే నోరుపారేసుకోవడం కాదని విమర్శించారు. 16వ ఆర్థిక సంఘాన్ని కూడా సీఎం రేవంత్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీలో 6.85 లక్షల కోట్లు అప్పు ఉన్నట్టు శ్వేతపత్రం విడుదల చేశారని పేర్కొన్నారు. అందులో మార్చి 2024 వరకు కాంగ్రెస్ తీసుకుబోయే అప్పులను కూడా కలిపి చెప్పారని తీవ్ర ఆరోపణ చేశారు. గోబెల్స్‌ని మించిపోయి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ లో ఉన్నోళ్లు ఒక్కరోజు తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు కాదని చెప్పారు. తాము చేసిన మంచి పనులను సీఎం చెప్పడం లేదన్నారు హరీష్ రావు.

 

మరీ ఇంత దారుణమా?

 

హైదరాబాద్, స్వేచ్ఛ: హాలియా పట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థుల నిరసనలకు సంబంధించి హరీష్ రావు, కేటీఆర్ ట్వీట్లు చేశారు. పరిపాలనను గాలికి వదిలేసి అనునిత్యం రాజకీయాలే చేసే రేవంత్ రెడ్డికి గురుకుల బాలికల ఆవేదన వినిపించడం లేదా? అని అడిగారు. కేటీఆర్ స్పందిస్తూ, కుక్క‌ల క‌న్నా దారుణంగా చూస్తున్నారని, నిత్యం పురుగుల అన్నం తిన‌లేక‌, క‌డుపులు మాడ్చుకోలేక చ‌చ్చిపోతున్నారని అన్నారు. అడిగితే ప్రిన్సిపాల్ తిడుతున్నారంటున్న వారి ఆవేద‌న విన‌ప‌డుతోందా? అంటూ ఫైరయ్యారు. కేసీఆర్ ఎంతో నిండు మ‌న‌సుతో తెచ్చిన గురుకులాల‌పై ఎందుకింత క‌క్ష‌? రాజ‌కీయం చేయాల‌నుకుంటే మాతో చేయండి భ‌రిస్తాం కానీ ఇలా ప‌సి పిల్ల‌ల‌తో కాదు అంటూ మండిపడ్డారు కేటీఆర్.