వైసీపీ నేతలకు టెన్షన్ మొదలయ్యిందా? ఏ కేసు తమ మెడకు చుట్టుకుంటుందోనని నేతలు భయంతో వణుకుతున్నారా? ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు? ముంబై నటి కేసులో ప్రభుత్వం దూకుడు పెంచిందా? వైఎస్ వివేకా కూతురు సునీతకు సీఎం చంద్రబాబు ఎలాంటి అభయం ఇచ్చారు? కూటమి నెక్ట్స్ టార్గెట్ కడప నేత? ఇవే ప్రశ్నలు వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
తన తండ్రిని చంపిన వారిని శిక్షించాలంటూ జగనన్న సర్కార్‌కు మొరపెట్టుకుంది వైఎస్ సునీత. న్యాయం దక్కక పోగా.. సునీత దంపతులపై రివర్స్ కేసు నమోదైంది. సీబీఐ అధికారులు విచారణకు పిలవడం జరిగిపోయింది. ఐదేళ్లు గడిచిపోయినా సీబీఐ దర్యాప్తు ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీంతో వైఎస్ వివేకా కేసు నీరు గారిపోయిందనే వాదన మొదలైంది. దీని వెనుక అవినాష్ ఉన్నాడంటూ రకరకాల ఆధారాలు సునీత బయటపెట్టింది. అయినా జగన్ సర్కార్‌లో ఎలాంటి కదలిక లేదు. పరిస్థితి గమనించిన వైఎస్ సునీత.. మొన్నటి ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో అధికార వైసీపీ చిత్తు చిత్తు అయ్యింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తమకు న్యాయం జరుగు తుందని వైఎస్ సునీత చాలా ఆశలు పెట్టుకున్నారు. మంగళవారం సచివాలయం లోని మొదటి బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్న సీఎం చంద్రబాబును కలిశారు వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత దంపతులు. వరద బాధితులకు తమవంతు సాయం అందించారు. ఈ క్రమంలో వైఎస్ వివేకానంద కేసులో ప్రస్తావించారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తనకు న్యాయం జరుగుతుందని సునీత ఓ అంచనాకు వచ్చారు.
అప్పటి వివేకా పీఎం కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలు నిగ్గు తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబును సునీత కోరారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీఐడీ విచారణ చేయాలని విన్నవించారు. సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి, తనకు అన్ని విషయాలు తెలుసని, తప్పనిసరిగా విచారణ చేయిస్తానని చెప్పడంతో న్యాయం జరుగుతుందని సునీత ఫ్యామిలీ భావిస్తోంది.
గడిచిన ఎన్నికల్లో ఇదే అంశంపై ప్రధానంగా ప్రచారం సాగింది. టీడీపీ అధికారంలోకి రాగానే వివేకానందరెడ్డిని చంపినవాళ్లను జైలుకు పంపిస్తామని కీలక నేతలు పదేపదే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబును నేరుగా సునీత సమావేశంకావడంతో ఈ కేసులో అరెస్టులు తప్పవన్నది వైసీపీ నేతల వెర్షన్. సీఎం చంద్రబాబుతో సునీత సమావేశం తర్వాత మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీటెక్ రవి కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. దీంతో ఈ కేసు వేగంగా ముందుకు వెళ్తుందనే అంచనాలు జోరందుకున్నాయి.
ఈ తరహా పరిణామాలను ముందే గమనించిన మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డిని ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. వాటి బాధ్యతలను జగన్ మేనమామ కొడుక్కి అప్పగించారు. సింపుల్‌గా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చారు అవినాష్‌రెడ్డి. ఈ ఎంపీ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరందుకున్నాయి. మొత్తానికి వివేకానంద కేసు రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.