వైసీపీ అధినేత జగన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీని వెంటాడుతుండగా, మరోవైపు నేతల రాజీనామాలు.. అధినేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా ఆ పార్టీ మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయడంతో కీలక నేతలు షాకయ్యారు.
ప్రజాక్షేత్రంలో నేతలు ఓడిపోవడం పార్టీ తప్పు చేసైనా ఉండాలి.. లేకుంటే ఆ నేత వల్ల సమస్యలు ఉండాలి. కానీ.. పార్టీ ఏరికోరి తీసుకొచ్చిన నేతలు సైతం ఆ పార్టీకి పదవులకు రాజీనామా చేయడం జగన్‌కు మింగుడు పడడంలేదు. గురువారం ఇద్దరు ఎంపీలు వైపీపీ రాజీనామా చేయడం, వాటిని రాజ్యసభ ఛైర్మన్ ఓకే చేయడం చకాచకా జరిగిపోయింది.
శుక్రవారం మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి పార్టీకి తమ పదవులకు రాజీనామా చేసినట్టు సమాచారం. మండలి ఛైర్మన్ మోషేన్ రాజును కలిసి తమ రాజీనామా లేఖలు అందజేసినట్టు వార్తలు వస్తున్నాయి. టీడీపీలో చేరేందుకు ఆయా నేతలు సన్నాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో అధికారం కోల్పోయినా మాజీ సీఎం జగన్ కొద్దిరోజులు ధీమాగా ఉన్నారు. రాజ్యసభలో ఎంపీలు, శాసనమండలిలో ఎమ్మెల్సీలు ఉండడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ బిల్లు పెట్టినా కచ్చితంగా పార్టీ అవసరం ఉంటుందని భావించారు. ఐదేళ్లలో కొంతకాలమైనా పర్వాలేదని భావించారు.
నేతలు వరుసగా రాజీనామాలు చేయడంతో ఆ పార్టీలో కీలక నేతలు షాకవుతున్నారు. అధికార పార్టీ నుంచి ఎలాంటి లీకులు లేకపోవడంతో కేంద్రం నుంచే ఇదంతా జరుగుతోందని నమ్ముతున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అధినేతతో ఇద్దరు నేతలు మాట్లాడినట్లు తెలుస్తోంది.
మిగతా నేతలైనా ఎవరు పార్టీలో ఉంటారో, జంప్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చాలావరకు మున్సిపల్, జెడ్పీ పీఠాలను టీడీపీ వంశం అయ్యాయి. దిగువస్థాయి నేతలు ఇప్పటికే వలస బాటపడ్డారు. ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్సీల వంతైంది.
ఫలితాల మొదలు ఇప్పటివరకు చాలామంది నేతలు పార్టీని వీడారు. మద్దాలి గిరి, శిద్ధా రాఘవరావు, కిలారి రోశయ్య, ఆళ్ల నాని, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్, ఇప్పుడు ఎమ్మెల్సీల వంతైంది. ఇంకెంతమంది ఆ లైన్‌లో ఉన్నారో చూడాలి.