ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు మంగళగిరి ఎకో పార్కులో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. చెట్లను నాటి వనం మనం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. ఈ మధ్యకాలంలో కేరళలో క్లౌడ్ బరస్త్‌తో వరదలు వచ్చాయని, చెట్లు లేకపోవడంతోనే అలాంటివి జరుగుతున్నాయని వివరించారు. గత ప్రభుత్వం కొండలు తవ్వేసిందని, రుషికొండ పరిస్థితి ఎలా ఉన్నదో అందరికి తెలుసని పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి కుప్ప వరకు విధ్వంసం చేశారని ఆరోపించారు. రూ. 500 కోట్లతో ప్యాలెస్ కట్టారని, వారికి ప్రకృతిపై ప్రేమ లేదన్నారు. కానీ, తమ ప్రభుత్వం ప్రకృతిని పరిరక్షించి భవితకు భద్రతనిస్తుందని వివరించారు. గత ప్రభుత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జోరుగా సాగిందని ఆరోపించిన సీఎం చంద్రబాబు తమ ప్రభుత్వంలో ఎర్ర చందనం నరకకుండా చూసుకుంటామని, డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తామని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ చెట్లను నరనివ్వడని, సహజ సంపద దోపిడీని అడ్డుకుంటాడని చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. గతంలో అధికారంలో ఉన్న నాయకుల వలే ఇప్పుడు పవర్ ఉన్నదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్యాలెస్ కట్టుకుంటే ఒప్పుకుంటామా? అని అడిగారు. పవన్ కళ్యాణ్ అలాంటివి చేయరని, అలా చేసేవారి తాట తీస్తారని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్‌కు చెట్లపై ప్రేమ ఉంటుందని, రాష్ట్రవ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని సూచించారు. కానీ, ఇప్పుడు అసలు ఎక్కడా గార్డెన్ లేదని వాపోయారు. పవన్ కళ్యాణ్ 50 శాతం వనం రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆయన అనుకున్నట్టు తప్పకుండా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మంగళగిరిలో ఎకో పార్క్ చాలా సుందరంగా ఉన్నదని, అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ ఎకో పార్క్ ఉండటం అదృష్టమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తనకు ఈ ప్రాంతానికి రావడం చాలా ప్రశాంతంగా ఉన్నదని వివరించారు. తనకు ఇక్కడే ఇల్లు కట్టుకోవాలని ఉన్నదని తెలిపారు. 2014లో తాము మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. గత ప్రభుత్వం 19 వేల కోట్ల దోపిడీ చేశారని, ఇసుక పెద్ద ఎత్తున దోచుకున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.
ఇదే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ముంబయి నటి కాదంబరి జెత్వానీ కేసును ప్రస్తావించారు. టీవీల్లో అంతా ఈ కేసు గురించి చర్చిస్తున్నారని గుర్తు చేశారు. ఓ ముంబయి నటిని అక్రమంగా కేసులో ఇరికించి వేధించారని ఆరోపించారు. పోలీసులు ఈ పనిలో భాగస్వామ్యం తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు ఇలా అమాయకులను అక్రమంగా ఇరికిస్తే ఎలా అంటూ కామెంట్ చేశారు. ప్రకృతిని కాపాడటమే.. చెట్లను పెంచడమే తమ విధానమని సీఎం మరోసారి పేర్కొన్నారు. రాష్ట్ర సహజ వనరులను కాపాడుకుంటామని తెలిపారు.