అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరుస వలసలతో కుదేలయింది బీఆర్ఎస్ పార్టీ. పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసి రాజకీయ రంగంలో అపర చాణిక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ కు సైతం ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితిలో దాదాపు ఎనిమిది నెలలుగా సైలెంట్ గా ఉన్నారు. అయితే కేసీఆర్ సైలెన్స్ ను కొంత మంది చాతకానితనంగా వర్ణిస్తూ వస్తున్నారు. ప్రతిపక్షనేతగానూ ఫెయిలయ్యారంటూ, పార్టీ వలనలను నియంత్రించలేకపోయారని కేసీఆర్ పై సోషల్ మీడియాలో పబ్లిక్ ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి. అయితే సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే కేసీఆర్ తనకు అనుకూలమైన రోజుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సమయం ఇప్పుడు వచ్చిందని భావిస్తున్నారు. వినాయక చవితి పండుగ తర్వాత ఇక తన కార్యక్రమాలు విస్తృతం చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారని సమాచారం.
కాంగ్రెస్ వైఫల్యాలపై
ఎనిమిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఇకపై పూర్తి స్థాయిలో ఎండగట్టాలని, హైడ్రా కూల్చివేతలపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. అలాగే రైతు భరోసా, రైతు భీమా వంటి అంశాలపై భారీ ఎత్తున రైతు ఉద్యమాలు కూడా చేసేందుకు మాస్టర్ స్కెచ్ వేస్తున్నారు. ఇదే సమయంలో కుమార్తె కవిత తీహార్ జైలు నుంచి బెయిల్ పై విడుదలవడం కేసీఆర్ కు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. కూతురు కవిత తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేవిధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఓ బహిరంగ సభను ఏర్పాటు చేసి రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుదామని అనుకుంటున్నారు. అయితే అదే సమయంలో కవితకు జరిగిన అన్యాయం..దాని వెనక జరిగిన కుట్రకోణం బహిరంగంగా ప్రజలకు తెలియజేద్దామని అనుకుంటున్నారని సమాచారం. దీనితో కవితపై సానుభూతి పెరిగే అవకాశం ఉంది. కావాలనే కుట్ర చేసి లిక్కర్ కేసులో ఇరికించారని చెబితే ఆమెపై సానుభూతి పెరిగి అది తమకు అనుకూలంగా మారుతుందని బీఆర్ఎస్ అగ్రనేత భావిస్తున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన వాల్మీకీ స్కామ్ తో తెలంగాణ ప్రభుత్వానికి అంతోకొంతో సంబంధాలు ఉన్నాయని ..ఈ వ్యవహారంలో ఇప్పటికే వారికి చెందిన కంపెనీల ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయని..ఈ విషయాన్ని బహిరంగంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు. అలాగే జాబ్ క్యాలెండర్ అంటే కేవలం ప్రకటనలే తప్ప నియామకాలు ఉండవని స్ట్రాంగ్ గా చెప్పాలని చూస్తున్నారు. అలాగే ఎల్ ఆర్ ఎస్ పేరిట కాంగ్రెస్ మరో దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పాలని చూస్తున్నారు.
కవితతో పబ్లిక్ మీటింగ్స్
తమ ప్రభుత్వ హయాంలో ఎల్ఆర్ఎస్ కింద పేదలకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ల్యాండ్ రెగ్యులరైజ్ చేసేందుకు ఈ పథకం ప్రవేశపెట్టామని..ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ సరికొత్తగా ఎల్ ఆర్ఎస్ పేరుతో భారీ ఎత్తున ఫీజులు వసూలు చేయాలని చూస్తోందని ప్రచారం చేయదలుచుకున్నారు కేసీఆర్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలోనూ బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రతి నియోజకవర్గ పరిధిలో ఓ పబ్లిక్ మీటింగ్ ఎరేంజ్ చేసి కవితతో కూడా మాట్లాడించాలని చూస్తున్నారు. ఇందుకోసం భారీగానే తండ్రీ కూతుళ్ల స్కెచ్ రెడీ అవుతోందని తెలుస్తోంది.