భారత ఉన్నత న్యాయస్థానంపై అత్యంత గౌరవం ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. న్యాయవ్యవస్థపై తనకు అపారమైన నమ్మకం ఉందని, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును తప్పు బట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. కావాలనే తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించి ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై నేను మాట్లాడిన మాటలను సోషల్ మీడియా సంస్థలు తప్పుదోవ పట్టించేలా ప్రసారం చేయించారన్నారు. అలాగే కొన్ని మీడియాలో వచ్చిన వార్తలకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
‘2024 ఆగస్టు 29న కొన్ని వ్యాఖ్యలు నేను చేసినట్లు పలు మీడియా సంస్థల్లో వచ్చాయని, అందులో నేను కోర్టును ప్రశ్నిస్తన్నట్లు అర్థంలో ధ్వనించాయి. నేను చేసిన వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా వార్తలు, కథనాలు కూడా వచ్చాయి. ఇలాంటి వార్తలు ప్రముఖ మీడియా సంస్థలో రావడంపై విచారం వ్యక్తం చేస్తున్నా. న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రతపై నాకు అపార గౌరవం, విశ్వాసం ఉంది. రాజ్యాంగం, దాని విలువను విశ్వసించే నేను..ఎప్పటికీ రాజ్యాంగం, న్యాయవ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటాను.’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.