కృష్ణా జిల్లాలో సభ్యసమాజం తలదించుకునేలా దారుణం చోటుచేసుకుంది. గుడ్లవల్లేరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ అమ్మాయిల హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాల కలకలం రేగుతోంది. ఏకంగా హాస్టల్ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరా బయటపడింది. దీంతో అర్ధారాత్రి కళాశాల విద్యార్థినులు ఆందోళనకు దిగారు. సెల్‌ఫోన్ టార్చ్ లైట్లు వేసి వీ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినులు నిరసన చేశారు.
కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని సహాయంతో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విజయ్.. అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరించి విక్రయిస్తున్నట్లు తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు 300 మంది యువతుల వీడియోలు చిత్రీకరించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వాట్సప్ గ్రూఫ్‌లో మెసేజ్‌లు బయటపడుతున్నాయి. దీంతో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం కావాలని తెల్లవారుజామున 4 గంటల వరకు నిరసన చేపట్టారు.
ఈ ఘటనకు కారణమైన విద్యార్థి విజయ్‌పై దాడికి తోటి విద్యార్థులు యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ హాస్టల్ వద్దకు చేరుకున్నారు. అనంతరం విద్యార్థినులకు నచ్చజెప్పి గొడవ జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్‌ను ప్రశ్నించారు. అక్కడ ఉన్న ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ విద్యార్థికి అమ్మాయిల హాస్టల్‌లో ఉండే ఓ విద్యార్థిని సహాయం చేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అనంతరం విజయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
ఇంజినీరింగ్ గర్ల్స్ హాస్టల్‌లో హిడెన్ కెమెరా గుర్తించారని వాట్సప్, ఫేస్ బుక్, ఎక్సవ్ వేదికగా విద్యార్థులు పోస్టులు పెట్టారు. ఇందులో కొంతమంది విద్యార్థినులు చేసుకున్న చాటింగ్ బయటపడింది. ఈ విషయం కాలేజీ యాజమాన్యంకు వారం రోజుల క్రితమే చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోయారు.
కాలేజీ యాజమాన్యం వాళ్లకే మద్దతు తెలుపుతుందని, వాళ్ల నాన్న ఓ పెద్ద రాజకీయ వేత్త అని అందులో పేర్కొన్నారు. ఆ విద్యార్థిని పేరు బయటకు వస్తే..డ్రగ్స్ కేసు పెట్టి ఎంక్వైరీ చేయిస్తానని కొంతమంది విద్యార్థినులపై బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అలాగే కాలేజీ మూసేస్తామని, ప్రిన్సిపల్ కూడా ఏం అనలేదని చెప్పుకొచ్చారు. మీరు ఏమైనా ఉంటే బయట చూసుకోవాలని, కాలేజీ పేరు బయటకు వస్తేఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం.
కాగా, సదరు విద్యార్థి విజయ్..ఆ విద్యార్థిని వేధింపులకు గురిచేయడంతోపాటు బ్లాక్ మెయిల్ చేసి వీడియోలు కావాలని హెచ్చరించినట్లు ఆరోపిస్తున్నారు. ఆ విద్యార్థిని వీడియోను అడ్డుపెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిందితుల్లో ఒకరు ప్రముఖ నాయకుడి తనయుడు కావడంతోనే యాజమాన్యం వారిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోజొ ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హిడెన్ కెమెరా ఆరోపణలపై విచారించాలని, తప్పు చేశారాని రుజువైతే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాలేజీల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, కాలేజీల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నారా లోకేశ్ స్పష్టం చేశారు.