మొన్నటి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలలో పాత బస్తీ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు మాధవీలత. తొలి సారి ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని మాధవీలతను ఏకంగా ఓటమి ఎరుగని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ పై పోటీకి మాధవీలతను బీజేపీ నిలబెట్టడంతో ఒక్కసారిగా వార్తలలోకి వచ్చారు మాధవీలత. విరించి ఆసుపత్రి చైర్ పర్సన్ గా ఆమె సుపరిచితురాలు. రాజకీయాలకు కొత్తే గానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రత్యేకించి హిందూ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఉంటారు. ఆమె మంచి వాగ్దాటి కలిగిన నేత. అందుకే బీజేపీ ఏరి కోరి ఆమెకు ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలబెట్టారు. ఇక ఎన్నికల ప్రచార సభలలోనూ మాధవీలత ఎంఐఎం నేత అసదుద్దీన్ వైఫల్యాలను ఎండగడుతూ పాత బస్తీ అంతటా ధైర్యంగా తిరిగారు. కోటి ఉమెన్స్ కళాశాల నుంచిఆమె పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశారు. కోటీశ్వరులాలైనా సామాన్య హిందూ స్త్రీలా ముఖాన పెద్ద బొట్టు, సంప్రదాయ చీరకట్లుతో కనిపిస్తుంటారు. ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. దాదాపు అసదుద్దీన్ పై గెలుస్గారనే ధీమాను తీసుకొచ్చారు మాధవీ లత. కానీ కొన్ని రౌండ్లలో వెనకబడ్డారు. దీనితో అసదుద్దీన్ గెలిచారు. మాధవీలత ఓడిపోయినా ప్రజాక్షేత్రంలో చురుకుగా పాల్గొంటునే ఉన్నారు.
చెరువును కబ్జా చేశారు
తాజాగా విరించి ఆసుపత్రిలో మీడియా సమావేశం నిర్వహించారు మాధవీ లత. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఐఎం కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఫాతిమా కళాశాల కబ్జా పై మాట్లాడుతూ చెరువును కబ్జా చేసి ఆ ప్రాంతంలో ఫాతిమా కాలేజీ నిర్వహిస్తున్న ఒవైసీపై కన్నెర్రచేశారు. ఓ పక్క చెరువులను కబ్జా చెరనుండి విడిపించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న ఎంఐఎం నేతలకు ఎందుకంత బలుపు అని ప్రశ్నించారు. ఎంఐఎం నేతలు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి వంత పాడతారని..అప్పట్లో కేసీఆర్ ని మచ్చిక చేసుకున్నట్లే..ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా మచ్చిక చేసుకుని తమపై కేసులు లేకుండా చూసుకోవాలని చూస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. సంతోష్ నగర్ పీఎస్ ఎదురుగా ఉన్న హిందూ దేవాలయాలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, విగ్రహాలకు సైతం నష్టం చేకూర్చారని..తాము ఇందుకు నిరసనగా శాంతియుతంగా రామనామం చేస్తున్నామని మాపై తప్పుడుకేసులు పెట్టారని అన్నారు.
ఎంఐఎం ఖబడ్దార్
ఎంఐఎం చెరువుల కబ్జా విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టమని ఈ విషయంలో ఎంఐఎం నేతలను నిలదీస్తామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఎంఐఎం నేతల కబ్జాలను సీరియస్ గా తీసుకోవాలని అన్నారు. తమపై తమ కార్యకర్తలపై ఎంఐఎం దాడులు చేస్తుంటే ఊరుకోమని..ఎలాగైనా కబ్జా చేసిన ప్రాంతాలను తిరిగి ప్రభుత్వానికి అప్పగించేదాకా వదిలేది లేదని ..ఎంఐఎం ఖబడ్దార్ అంటూ మండిపడ్డారు. అలాగే రాబోయే వినాయక చవితి ఉత్సవాలను బీజేపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా జరిపించేందుకు కృషిచేస్తామని అన్నారు. కానీ కొందరు మాత్రం అల్లర్లు సృష్టించాలని చూస్తే ఊరుకోమని పరోక్షంగా ఎంఐఎం నేతలను హెచ్చరించారు. అలాగే వక్ఫ్ భూములు అన్యాక్రాంత మవుతున్నాయని..ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించాలని అన్నారు.