ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత అయిదున్నర నెలల తర్వాత బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం కోర్టు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని తిహార్ జైలు నుంచి విడుదలైన కవిత రాత్రి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బస చేశారు. బుధవారం ఉదయం ట్రయల్ కోర్టు చేపట్టిన విచారణకు వర్చువల్‌గా హాజరైన అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అనేక కీలక మలుపులు తిరిగిన ఈ కేసులో ఎట్టకేలకు కవితకు బెయిల్ లభించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమైంది. కవితను స్వాగతిస్తూ.. శంషాబాద్ విమానాశ్రయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
ఇక.. యుద్ధమే
మంగళవారం రాత్రి జైలు నుంచి బయటకు రాగానే.. స్వాగతం పలకడానికి సిద్ధంగా భర్త, కుమారుడిని చూసి కవిత భావోద్వేగానికి లోనయ్యారు. వారిని హత్తుకున్నారు. అనంతరం సోదరుడు కేటీఆర్, హరీశ్ రావును అలింగనం చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. కవిత జైలు నుంచి బయటకురాగానే బాణాసంచా కాల్చి ‘కవిత.. డాటర్ ఆఫ్ ఫైటర్’ అంటూ నేతలు, కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేయటంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు భావోద్వేగపూరిత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే నేను మొండిదాన్ని.. అనవసరంగా నన్ను జగమొండిగా మార్చారు. నేను కేసీఆర్ బిడ్డను. తప్పు చేసే ప్రసక్తే లేదు. 18 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. నన్ను ఇబ్బంది పెట్టిన అందరూ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. నన్ను, నా కుటుంబాన్ని వేధించిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తా. నేను భయపడే రకం కాదు.. పోరాడే మనిషిని. ఇక నుంచి తగ్గేదే లేదు. ఇంకా గట్టిగా పనిచేస్తా. రాజకీయంగా యుద్ధమే చేస్తమని కవిత అన్నారు. ఇలాంటి కష్ట సమయంలో నాకు, మా కుటుంబానికి, పార్టీకి అండగా నిలిచిన అందరికీ ధన్యావాదాలు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం ఆమె ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బస చేశారు.
వర్చువల్ విచారణ..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్‌పై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు విచారణకు కవిత, ఇతర నిందితులైన మనీష్ సిసోడియా, ఇతర నిందితులూ వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కొన్ని డాక్యుమెంట్స్ సరిగా లేవని, కోర్టు రికార్డుల నుంచి బెస్ట్ క్వాలిటీతో ఉన్న పత్రాలను ఇవ్వాలని నిందితుల న్యాయవాదులు కోర్టును కోరారు. సెప్టెంబర్ 4 లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్లను వారికి అందజేయాలని, ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబరు 11న కొనసాగిస్తామని జడ్జి కావేరి భావేజా ప్రకటించారు. భవిష్యత్ విచారణకు కవిత హాజరు కావాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది.
సత్యమే గెలుస్తుంది..
హైదరాబాద్ చేరుకునేందుకు ముందు ఢిల్లీ విమానాశ్రయంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని అన్నారు. న్యాయం కోసం తన పోరాటం కొనసాగుతుందని, ఈ కష్టసమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఘన స్వాగతం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ నుంచి శంషాబాద్‌కు విమానంలో చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో అమెకు గులాబీ శ్రేణులు, జాగృతి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గులాబీ నేతలు, కార్యకర్తలు కవితపై పూలవర్షం కురిపించగా.. పార్టీ శ్రేణులకు కవిత అభివాదం చేశారు. పిడికిలి బిగించి ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు. కార్యకర్తల జై తెలంగాణ నినాదాలతో ఎయిర్‌పోర్ట్ దద్దరిల్లింది. విమానాశ్రయం నుంచి ర్యాలీగా బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. కాగా, గురువారం కవిత ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లోని తండ్రి కేసీఆర్‌తో సమావేశం కానున్నారు.