ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. కేంద్రం ఆమోదం..

ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి రెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాయన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లుకు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను కేంద్రం మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా హైదరాబాద్ – బెంగళూరు, విశాఖపట్నం – చెన్నై కారిడార్లను అభివృద్ధిమంటూ కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

 

కడప జిల్లాలోని కొప్పర్తిలో పారిశ్రామిక హబ్ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం కేంద్రం రూ. 2,137 కోట్లను ఖర్చు చేయనున్నదని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ హబ్ తో 54,500 మందికి ఉపాధి లభించనున్నదన్నారు. అదేవిధంగా కొప్పర్తిలో ఉత్పత్తి రంగంపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు.

 

అదేవిధంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీని కోసం రూ. 2,786 కోట్లు వెచ్చించనున్నట్లు ఆయన చెప్పారు. దీని ద్వారా కూడా సుమారుగా 45 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అంతేకాదు.. రాయలసీమకు లబ్ధి చేకూరనున్నదన్నారు.

 

ఏపీలో ఏర్పాటు చేయబోయే ఈ రెండు స్మార్ట్ సిటీలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఏపీ అభివృద్ధి విషయంలో ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *