లేటరల్ రిక్రూట్‌మెంట్‌పై రాహుల్ ఫైర్..!

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైరయ్యారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వ శాఖలు లేదా సంస్థలల్లో లేటరల్ ఎంటీ పద్ధతిన నియామకాలు చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. యూపీఎస్సీకి బదులుగా ప్రత్యామ్నాయ మార్గంలో నియామకాలు చేపడుతూ భారత రాజ్యాంగంపై దాడి చేస్తున్నారంటూ ఆయన కేంద్రంపై సీరియస్ అయ్యారు. అయితే, లేటరల్ ఎంట్రీ పద్ధతిలో 45 మంది సంయుక్త కార్యదర్శులు, ఉప కార్యదర్శుల నియామకానికి సంబంధించి యూపీఎస్సీ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ విధాన్నాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా ఖండించారు.

 

ఆ పోస్ట్ లో రాహుల్ ఇలా పేర్కొన్నారు. ‘ఉన్నత స్థానాల్లో ఇప్పటికే అణగారిన వర్గాలకు ప్రాతనిథ్యం దక్కడంలేదు. ఈ విషయాన్ని కేంద్రం గాలికి వదిలేసింది. పైగా దీనిని మెరుగుపరిచే దిశగా అడుగులు వేయకుండా.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో లేటరల్ ఎంట్రీ పద్ధతిన నియామకాలను చేపడుతూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల రిజర్వేషన్లను లాక్కుంటున్నారు. ఈ పద్ధతిని కేంద్రం పాటిస్తూ అణగారిన వర్గాల ప్రజలను ఆ పదవులకు దూరం చేస్తున్నది. సివిల్స్ పరీక్షలకు సిద్ధమైతున్న యువత హక్కులను కాజేస్తున్నారు. సామాజిక న్యాయాన్ని కేంద్రం కాలరాస్తున్నది. కీలకమైన ప్రభుత్వ పదవుల్లో చేరడం ద్వారా పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ఏం చేస్తారనే విషయానికి ప్రధాన ఉదాహరణ ‘సెబీ’నే. ఈ విధంగా నియామకాలు చేపట్టడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.’

 

అయితే, ప్రభుత్వ శాఖల్లో డైరెక్టర్లుగా, కార్యదర్శులుగా, సంయుక్త, ఉప కార్యదర్శులుగా ప్రైవేటు రంగంలో ఉండే ప్రతిభావంతులైన వారిని నియమించుకోవొచ్చంటూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి ఈ నాలుగు పోస్టులకు సివిల్ సర్వీసెస్ అధికారులను లేదా గ్రూప్ ఏ అధికారులను నియమిస్తుంటారు. ఇందుకు విరుద్ధంగా కేంద్రం కాంట్రాక్టు పద్ధతిన నియామకాలను చేపడుతోంది. ఇదిలా ఉంటే.. 2018లో తొలిసారిగా యూపీఎస్సీ 10 మంది సంయుక్త కార్యదర్శుల నియామకం కోసం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 

ఇదిలా ఉంటే..

 

యూపీఎస్సీలో లేటరల్ విధానంలో నియామకాలు చేయడంపై ఎస్పీ, బీఎస్పీ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై భగ్గుమన్నాయి. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ఈ విధంగా నియామకాలు చేపడుతుందంటూ మండిపడ్డారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మాట్లాడుతూ.. లేటరల్ స్కీమ్ ను తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో యువత ఉన్నత స్థానాల్లోకి వెళ్లకుండా నిలువరించినట్టే అవుతుందన్నారు. ఈ విధంగా నియామకాలు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అదేవిధంగా ఈ విధానానికి వ్యతిరేకంగా అక్టోబర్ 2న పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామంటూ అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.

 

ఇటు ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఈ లేటరల్ రిక్రూట్ మెంట్ విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతూ.. ఒక్కొక్కటిగా బీజేపీ ప్రభుత్వం తాము అనుకున్నదిగా నెమ్మదిగా ఇంప్లీమెంట్ చేస్తున్నది అన్నారు. చివరకు రిజర్వేషన్లను ఎత్తివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *