కోల్‌కతా కేసులో కీలక మలుపు.. సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు..

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ పై దారుణ లైంగికదాడి, హత్య ఘటన దేశాన్ని కుదిపేస్తు్న్నది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఈ ఘటనపై ఆందోళనలు జరుగుతున్నాయి. మహిళలకు భద్రత, ట్రైనీ డాక్టర్ కేసులో న్యాయం కావాలని ఆందోళనకారులు రోడ్డెక్కారు. ఇప్పటికీ కోల్‌కతా వీధుల్లో నిరసనకారుల నినాదాల హోరు కొనసాగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో కీలక మలుపు ఎదురైంది. సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. మంగళవారం నుంచి సీజేఐ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది.

 

ఈ ఘటనపై మమతా బెనర్జీ సర్కారు కూడా సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఘటన జరిగిన ఉదయమే పోలీసులు స్పాట్‌కు వెళ్లి వీడియో రికార్డు చేశారు. వీడియో రికార్డింగ్‌లో విచారణ చేశారు. బాధిత కుటుంబం కూడా మమతా బెనర్జీ ప్రభుత్వంపై నమ్మకముంచి రాష్ట్ర పోలీసుల విచారణకు అంగీకారం తెలిపింది. కానీ, ఆ తర్వాత ఈ కేసును సీబీఐ టేకప్ చేసింది. ప్రస్తుతం సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తు్న్నది. ఘటన జరిగిన ఆర్‌జీ కర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. సీబీఐ ఈ సందీప్ ఘోష్, కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ సహా మొత్తం 40 మందిని విచారిస్తున్నది. ఇప్పటికే ఘోష్‌ను 23 గంటలపాటు ఏకధాటిగా ప్రశ్నలు గుప్పించి విచారణ జరిపింది.

 

కాగా, నిందితుడు సంజయ్ రాయ్ మానసిక పరిస్థితిని విశ్లేషించాలని సీబీఐ భావిస్తు్న్నది. అందుకే సైకో అనాలసిస్ టెస్టు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఫోరెన్సిక్ టీమ్ ఢిల్లీ నుంచి కోల్‌కతాకు చేరుకుంది. ఇవాళ లేదా రేపు ఈ టెస్టు జరగొచ్చు. సంజయ్ రాయ్ మానసిక పరిస్థితి, నేర ప్రవృత్తి వంటి విషయాలను ఈ టెస్టు ద్వారా తెలుసుకోనున్నారు.

 

సుప్రీంకోర్టు విచారణతో ఈ దర్యాప్తు మరింత వేగం సంతరించుకోవచ్చు. దర్యాప్తు చేయడానికి ప్రత్యేక కమిటీ లేదా దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది.

 

కాగా, ఈ ఘటనకు సంబంధించి ఆందోళనలు కోల్‌కతాలో ఇంకా ఉధృతంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. డ్యురండ్ కప్ మ్యాచ్ ఇవాళ కోల్‌కతాలో జరగాల్సింది. కానీ, నిరసనకారులు అడ్డుకున్నారు. దీంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేశారు. నిరసనకారులను అదుపులో పెట్టే క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఇక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

 

ఇదిలా ఉండగా.. ఈ ఘటన చుట్టూ అనేక అవాస్తవ ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఆమె మెడ ఎముక విరిగిందని, బాడీలో 150 గ్రాములు సెమెన్ లభించిందని, ఇలా కొన్ని ప్రచారాలు జరిగాయి. ఇవి అవాస్తవాలని పోలీసులు కొట్టిపారేశారు. ఎముకలు విరగలేవని, అలాగే.. సెమెన్‌ను మిల్లీలీటర్లలో కొలుస్తారని, ప్రచారంలో ఉన్నట్టుగా 150 గ్రాముల సెమెన్ అంటే వందల మంది భాగస్వాములైనట్టు అనుకోవాల్సి ఉంటుందని, కానీ, అదంతా అవాస్తవం అని పోలీసులు ఖండించారు. ఇలాంటి ఘటనల్లో బాధితుల పేర్లను గోప్యంగా ఉంచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *