షాకింగ్ కామెంట్స్ చేసిన బండి సంజయ్.. నిజంగానే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవబోతుందా..?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ అంశంపై తీవ్రంగా చర్చ కొనసాగుతుంది. ఉద్యమ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో చేరబోతున్నదంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. పలువురు నేతలు కూడా ఈ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవలే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో బీజేపీలో చేరబోతున్నదని చెప్పారు. అందులో భాగంగా కేసీఆర్ కు గవర్నర్ పదవి, ఆయన కుమారుడు కేటీఆర్ కు కేంద్రమంత్రి పదవి, కవితకు రాజ్యసభ సీటు దక్కనున్నదన్నారు. ఇందుకు సంబంధించి చర్చలు కూడా నడుస్తున్నాయంటూ ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు పలు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై తీవ్ర చర్చ కొనసాగుతున్నది. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడా చూసినా కూడా ఇదే అంశం గురించి చర్చిస్తున్నారు. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మెర్జ్ కాబోతున్నదా? అంటూ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

 

అయితే, ఇది ఎంతవరకు నిజమనేది కొద్దిసేపు పక్కన పెడితే.. ఈ అంశంపై తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ గంగలో కలిసిన పార్టీ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపితే వచ్చే లాభమేమీ లేదంటూ ఆయన పేర్కొన్నారు. అవినీతి, కుటుంబ పార్టీలకు బీజేపీ పార్టీ ఎప్పుడూ దూరంగా ఉంటదని చెప్పుకొచ్చారు. కేసీఆర్, కేటీఆర్ ను ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కాదు.. కాంగ్రెస్ పార్టీలోనే విలీనం కాబోతున్నదంటూ బండి సంజయ్ జోస్యం చెప్పారు. అందులో భాగంగానే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు.

 

కేసీఆర్ ప్రస్థానం కాంగ్రెస్ తోనే మొదలైందన్నారు. తమ పార్టీ బీజేపీకి ఎవరి మద్దతు అవసరంలేదని స్పష్టం చేశారు. ప్రజల మద్దతు ఉంటే చాలు అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలను పక్కదోవ పట్టించడానికే విలీన ప్రచారం చేస్తున్నారన్నారు. రుణమాఫీ విషయంలో ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు. రైతులకు బ్యాంకుల నుంచి ఎన్ఓసీలను ఇప్పించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీజేపీ కొట్లాడుతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు.

 

ఇదిలా ఉంటే.. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. అదంతా ఫేక్ అంటూ కొట్టిపారిసిన విషయం తెలిసిందే. తాము ఢిల్లీకి తన సోదరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఉన్నందునా ఆమెను కలిసేందుకు వెళ్లామని, అదేవిధంగా ఆమె బెయిల్ కు సంబంధించిన అంశంపై పలువురు న్యాయవాదులతో చర్చలు జరిపినట్లు ఆయన చెప్పుకొచ్చారు. తాము ఢిల్లీకి వెళ్లినంత మాత్రానా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసినట్లా? అంటూ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *