ప్రపంచవ్యాప్తంగా ఎంపాక్స్ కేసుల విస్తృతిని నిశితంగా గమనిస్తున్నాం: కేంద్రం..

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ (ఎంపాక్స్) కేసులు ఉనికిని చాటుకుంటున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రపంచ దేశాల్లో ఎంపాక్స్ కేసుల విస్తృతిని నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించింది. ఎంపాక్స్ ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని, నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. భారత్ లో ఎంపాక్స్ కొత్త కేసులేవీ రాలేదని పేర్కొంది.

 

ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం జరిగింది. ఎంపాక్స్ ప్రభావం భారత్ లో పెద్దగా లేనప్పటికీ, భారీ ఎత్తున చర్యలు తీసుకోవాలని నడ్డా ఆదేశించారు.

 

అన్ని ఎయిర్ పోర్టులు, హార్బర్లు, సరిహద్దుల వద్ద వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని, ఎంపాక్స్ ను నిర్ధారించే ల్యాబొరేటరీలను సిద్ధం చేయడం, మంకీపాక్స్ ను గుర్తించడం, ఐసోలేట్ చేయడం, చికిత్స వంటి అంశాలకు తగిన ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు.

 

మంకీపాక్స్ ప్రపంచ ముప్పుగా పరిణమించే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *