పెట్టుబడులు లక్ష్యంగా విదేశీ పర్యటన –:మంత్రి శ్రీధర్ బాబు..

రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విదేశీ పర్యటనపై  సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అమరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటన సాగిందని తెలిపారు. అమెరికా పర్యటనలో 19 కంపెనీలతో రూ. 31,500 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయని, దక్షిణ కొరియా పర్యటనలో ఆరు కంపెనీలతో రూ. 4,300 కోట్ల పెట్టుబడుల ఒప్పందం కుదిరిందని, ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రంలో 30,750 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత సీఎం స్థాయి వ్యక్తి తొలిసారి విదేశీ పర్యటన చేశారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ పర్యటనల ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనేదే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. విదేశీ పర్యటనలో తాము ఏఐ దిగ్గజ సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామని, ప్రపంచ బ్యాక్ అధ్యక్షుడు అజయ్ బంగా, శాంతహ్ను నారాయణతో భేటీ అయ్యామని వివరించారు. ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, మూసీ సుందరీకరణ అంశాలు తమ పర్యటనలో ప్రధానంగా చర్చకు వచ్చాయని తెలిపారు. హైదరాబాద్ 4.0 విజన్ పై తమ ఆలోచనలను అక్కడి బిజినెస్‌మెన్లతో పంచుకున్నామని వివరించారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ బ్రాంచీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కోరామని చెప్పారు.

 

దావోస్ పర్యటనలో కాగ్నిజెంట్ విస్తరించాలని కోరామని, అందుకు తగ్గ విధంగానే ఆగస్టు 14వ తేదీన ఇక్కడ ప్రారంభించామని మంత్రి శ్రీధర్ తెలిపారు. ఫార్మా రంగంలో మరో ముందడుగు వేస్తున్నామని, డేటా సెంటర్‌లను పెద్ద ఎత్తున విస్తరించాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. అమెజాన్ అతిపెద్ద మెయిన్ బ్రాంచీకి హైదరాబాద్ కేంద్రం కానుందని పేర్కొన్నారు. ఇథనాల్ కంపెనీ ఏర్పాటు కోసం చర్చలు జరుగుతున్నాయని, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం ఉంటుందని వివరించారు. తెలంగాణ యువత ఉపాధి కోసం భేషజాలు లేకుండా పని చేస్తామని స్పష్టం చేశారు. కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం సందర్శించారని, ఇదే తరహాలో తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలే ఆలోచన ఉన్నదని, పెట్టుబడులు హైదరాబాద్ వరకే కాకుండా, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా వచ్చేలా పని చేస్తు్న్నామని వివరించారు. ప్రతి గ్రామం అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.

 

పెట్టుబడులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమే తాము విదేశీ పర్యటన చేశామని స్పష్టం చేశారు. ఇక ప్రతిపక్షాల విమర్శలను పేర్కొంటూ.. సినిమా ఫ్లాప్ అవుతుందా? లేదా? అని షో చేయడానికి తాము పోలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పర్యటిచామని వివరించారు.

 

కేసీఆర్ చైనా వెళ్లారని గుర్తు చేస్తూ.. 1000 కోట్ల పెట్టుబడులు తెస్తామని వెళ్లారని మంత్రి పేర్కొన్నారు. ఆ పర్యటనలో 15 రోజులు అక్కడే ఉన్నారని, కానీ, గ్రౌండ్‌లో వందో.. రెండు వంద కోట్లో పెట్టుబడులుగా వచ్చాయని వివరించారు. అలాంటివి వారికి కనిపించలేదా? అని నిలదీశారు. పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.

 

గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో 30 శాతం కూడా కార్యరూపం దాల్చలేదని, అంతా పేపర్‌ వరకే పరిమితం అయిందని మంత్రి ఆరోపించారు. కానీ, తమ ప్రభుత్వం పరిశ్రమల కోసం ప్రత్యేకంగా కొత్త పాలసీని రూపొందించనుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఎవరు ముందుకు వచ్చినా వారితో చేతులు కలపడానికి తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు. పెట్టుబడుల విషయంలో విదేశాల్లో భారతీయుల పాత్ర కీలకమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వారికి హామీ ఇవ్వడంతో వారు సానుకూలంగా ముందుకు వస్తున్నారని వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవడానికి సిద్ధమని చెబుతున్నట్టు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *