ప్రధాని మోదీతో ఏపీ సీఎం కీలక భేటీ..! రాజధాని అమరావతి అభివృద్ది పై చర్చ..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి మోదీతో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ విషయంలో రూ. 15 వేల కోట్ల ఆర్థిక సాయం చేస్తామంటూ ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నిధుల విడుదలపైనా చంద్రబాబు వాకబు చేసినట్లు సమాచారం.

 

అదేవిధంగా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యే ఖర్చు తామే భరిస్తామంటూ కూడా కేంద్రం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన నిధులపై కూడా ఆయన ప్రధానితో చర్చించినట్లుగా తెలుస్తోంది. వీటితోపాటు వెనకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థిక సాయం కింద నిధులు విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కోరినట్లు సమాచారం. ఈ అంశాలతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

 

అయితే, ఈ సమావేశంలో తాను ప్రతిపాదించిన అంశాలపై ప్రధాని సానుకూలంగా స్పందిచారని, ఈ నేపథ్యంలో చంద్రబాబు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *