పంద్రాగస్టుకు సర్వం సిద్ధం.. ‘వికసిత్ భారత్ @ 2047’ అనే థీమ్‌తో వేడుకలు..

దేశ రాజధానిలో జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలక సర్వం సిద్ధం అయింది. ఢిల్లీలోని ఎర్రకోట మీద గురువారం ఉదయం భారత ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ఏడాది ఈ వేడుకలకు సుమారు 6 వేల మంది అతిథులు హాజరవుతున్నారు. వివిధ రంగాల్లో రాణించిన, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిలో కొందరిని కేంద్రం ప్రత్యేక అతిథులుగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. నిఘా వర్గాల సూచనల మేరకు ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వేలాది మంది పోలీసులు, సాయుధ బలగాలు భద్రతా పరమైన విధుల్లో నిమగ్నమై ఉన్నాయి. మరోవైపు, స్వాతంత్య్ర దినోత్సవ పూర్వ సంధ్యలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

 

ఈ ఏడాది ప్రత్యేకతలు..

ఈ ఏడాది ‘వికసిత్ భారత్ @ 2047’ అనే థీమ్‌తో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు ఇది మరింత బలాన్నిస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని సైతం వేడుకలకు ఆహ్వానించారు. ఎర్రకోట వేదికగా జరిగే ప్రధాన కార్యక్రమానికి దాదాపు 400 మంది పంచాయతీరాజ్‌ సంస్థల మహిళా ప్రతినిధులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించినట్లు సంబంధిత మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సుమారు 45 మంది ‘లఖ్‌పతీ దీదీలు’, 30 మంది ‘డ్రోన్‌ దీదీల’ను కూడా ఆహ్వానించినట్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వేడుకలకు దాదాపు 6 వేల మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానం అందింది. నీతి ఆయోగ్ నుండి 1,200 మంది ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు.

 

భద్రత కట్టుదిట్టం

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం, పార్లమెంట్, ఇండియా గేట్, ఐజిఐ విమానాశ్రయం, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్లు, మాల్స్, మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో కేంద్ర బలగాల‌తో భ‌ద్రతను ప‌టిష్ఠం చేశారు. ఆగస్టు 15వ తేదీన 11వ సారి ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ ప‌తాకాన్ని ఎగురవేయ‌నున్నారు. వికసిత భారత్ థీమ్ తో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోటలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎర్రకోట పరిసరాల్లో 700 ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 10వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఎర్ర కోటలో వేడుకలకు 20 నుంచి 22 వేల మంది ప్రజలు హాజ‌రుకానున్నారు. వేడుకలకు హాజరయ్యేవారికి క్యూఆర్ స్కానింగ్ కోడ్ పాసులు జారీ చేశారు. స్నైపార్స్, షార్ప్ షూటర్లు, స్వాట్ కమండోలతో ప్రధాని సహా ప్రముఖులకు భద్రత క‌ల్పించ‌నున్నారు. ఈసారి ట్రాఫిక్ విధుల్లో 3వేల మంది పోలీసులు పాల్గొన‌నున్నారు. ఎర్రకోట వ‌ద్ద వేడుక‌లు ముగిసే వరకు ఆ ప్రాంతపు గగన తలంపై ఆంక్షలు విధించారు. ఈ ఏడాది ప్రధాన కార్యక్రమ భద్రతా ఏర్పాట్లను ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా పర్యవేక్షిస్తున్నారు.

 

గోల్కొండ ముస్తాబు..

మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుక కోసం గోల్కొండ ముస్తాబైంది. ఆగస్టు 15 ఉదయం సికింద్రాబాద్లోని అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి నివాళులర్పించి, అనంతరం గోల్కొండ కోటకు చేరుకుంటారు. అనంతరం ఆయన పోలీసు దళాల గౌరవ వందనాన్ని అందుకుంటారు. పిదప కోటలోని రాణీ మహల్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా గురువారం ఉదయం గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండాను ఎగరేయనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పర్యవేక్షించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ.. గుస్సాడి, కొమ్ము కోయ, లంబాడీ, డప్పులు, ఒగ్గు డొల్లు, కోలాటం, బోనాలు కోలాటం, భైండ్ల జమిడికల్, చిందు యక్షగానం, కర్రసాము, కూచిపూడి, భరతనాట్యం, పేర్ని వంటి వివిధ కళారూపాలకు చెందిన వెయ్యి మందికి పైగా కళాకారులు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. వర్షం వచ్చినా వేడుకలకు ఆటంకం కలగకుండా, వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *