వైసిపి నేతలకు బిగుసుకుంటున్న ఉచ్చు..? నెక్స్ట్ వారేనా..?

ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత వైసీపీ నేతల కేసుల విచారణ వేగం పెరిగింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నమోదైన కేసుల్లో ఇప్పుడు నాడు కీలకంగా వ్యవహరించి నేతలను విచారిస్తున్నారు. ఇప్పటికే జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నేడు జోగి విచారణకు హాజరవుతున్నారు. వంశీ హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. దీంతో, నెక్స్ట్ అరెస్ట్ ఎవరు. లిస్టులో ఉన్నదెవరు.

ఉచ్చు బిగుస్తోంది

వైసీపీ ముఖ్య నేతలకు కేసుల ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు దాడికి దిగిన కేసులో పోలీసులు జోగి రమేష్ కు పోలీసులు నిన్ననే నోటీసులు ఇచ్చారు. నిన్న సాయంత్రమే ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, కుమారుడు రాజీవ్ అరెస్ట్ కావడంతో ఈరోజు విచారణకు హాజరవుతానని తెలిపారు. విచారణకు వచ్చేటప్పుడు 2022 లో వినియోగించిన మొబైల్ ఫోన్ ను తీసుకురావాలని పోలీసులు కోరారు.

వరుస విచారణలు

జోగి రమేష్ అన్ని వివరాలతో నేడు పోలీసుల ఎదుటకు విచారణకు హాజరుకానుండటంతో ఉత్కంఠ నెలకొంది. అదే విధంగా గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వల్లభనేని వంశీ హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ రోజు విచారణకు రానుంది. వల్లభనేని వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే వంశీ ప్రధాన అనుచరులను అరెస్ట్ చేసారు. అటు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పైన పలు కేసులు ఉన్నాయి. కొన్నింటిలో నాని కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇతర నేతల పైన కేసుల్లోనూ విచారణ ముమ్మరం అయింది.

 

అరెస్ట్ ఖాయమంటూ

అటు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్, గనుల శాఖల్లో కీలకంగా వ్యవహరించిన అధికారుల కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. ఇప్పుడు వరుసగా కేసులతో కృష్ణా జిల్లాకు చెందిన మరో నేత త్వరలోనే అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతుంది. అటు టిడ్కో ఇళ్ళతో పాటుగా జగనన్న కాలనీల్లో జరిగిన అక్రమాల పైన విజిలెన్స్ విచారణ ప్రారంభం అయింది. ఈ వరుస విచారణలతో వైసీపీ ముఖ్య నేతల్లో.. ఆరోపనలు ఎదుర్కొంటున్న అధికారుల్లోనూ టెన్షన్ పెరుగుతోంది. ఈ రోజు కేసులు ఎదుర్కొంటున్న వైసీపీ ముఖ్య నేతల విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *