అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం.. జోగి రాజీవ్ అరెస్ట్..

ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో రాజీవ్ ను అరెస్ట్ చేసి.. గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జోగి రాజీవ్.. వాళ్లెలా అమ్మారో.. తాము కూడా అలాగే అమ్మామని చెప్పాడు. ఈనాడు పేపర్ లో వాళ్లు ప్రకటన ఇచ్చి భూములను అమ్మారని, తాముకూడా అదే పేపర్ లో ప్రకటన ఇచ్చి భూముల్ని అమ్మామని తెలిపాడు. ఇందులో ఎలాంటి గోల్ మాల్ లేదని తెలిపాడు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్ట్ చేయించిందని పేర్కొన్నాడు. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల్లో జోగి రమేష్ A2 నిందితుడిగా ఉన్నాడు. గొల్లపూడి ఏసీబీ కార్యాలయంలో జోగి రమేష్ ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు జోగి రమేష్.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. తన కొడుకును అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. తనపై కోపం ఉంటే.. కక్షను తనపై తీర్చుకోవాలే గానీ.. మధ్యలో తన కొడుకు జోలికి రావడం ఏ మాత్రం సబబు కాదన్నారు. తప్పుడు కేసులు బనాయించడం సరికాదని వాపోయారు. ఇది కచ్చితంగా రాజకీయ ప్రేరేపిత చర్యేనని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని దుయ్యబట్టారు.

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏ1గా జోగి రమేష్ బాబాయ్ వెంకేశ్వరరావు, ఏ3గా అడుసుమిల్లి మోహన రామదాస్, ఏ4గా అడుసుమిల్లి వెంకట సీతామహాలక్ష్మి, ఏ5గా గ్రామ సర్వేయర్ దేదీప్య, ఏ6గా మండల సర్వేయర్ రమేష్, ఏ7గా డిప్యూటీ తహశీల్దార్ విజయ్ కుమార్ లు ఉన్నారు.

ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సీఐడీ ఇప్పటికే జప్తు చేసిన భూములపై క్రయవిక్రయాలు జరిపినట్లు గుర్తించింది ఏసీబీ. గన్నవరంలో ఉన్న సర్వే నంబర్లను మార్చి.. వేర్వేరు పేర్లపై భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించి.. వాటిని అమ్మడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు జోగి రాజీవ్ ను అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *