తుంగభద్ర డ్యామ్ లో 19వ గేటు చైన్ తెగిపోయి కొట్టుకుపోవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా..!

కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ లో 19వ గేటు చైన్ తెగిపోయి కొట్టుకుపోవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ లను అడిగి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. డ్యామ్ గేటు కొట్టుకుపోయి భారీగా నీరు వస్తుండటంతో.. ఉమ్మడి కర్నూల్ జిల్లాకు వరదముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు.

 

అలాగే ప్రాజెక్టు వద్దకు వెంటనే డిజైన్ టీమ్ ను పంపాలని సీఎం సూచించారు. డ్యామ్ అధికారులతో మాట్లాడాలని మంత్రి పయ్యావుల కేశవ్ ను ఆదేశించారు. ప్రస్తుతం తుంగభద్రలో 6 మీటర్ల ఎత్తు వరకూ నీరు ఉందని, అధికారులు స్టాప్ లాక్ అరేంజ్ చేయడం ద్వారా నీరు వృథా కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎంకు వివరించారు సాయిప్రసాద్.

 

డ్యామ్ వద్ద తాత్కాలికంగా స్టాప్ లాక్ ఏర్పాటు చేసేందుకు ఇబ్బందులున్నట్లు మంత్రి పయ్యావుల సీఎంకు తెలిపారు. డ్యామ్ డిజైన్ పాతది కావడం, గేట్లు వర్టికల్ గా ఉండటం వల్ల స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారాయన. ఇదిలా ఉండగా డ్యామ్ గేట్లన్నింటినీ ఎత్తి లక్షక్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డ్యామ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. అవసరమైనవారు హెల్ప్ లైన్ నంబర్లు 1070, 112 సంప్రదించాలని సూచించారు.

తుంగభద్ర నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల అధికారులు అప్రమత్తమయ్యారు. సుంకేశుల, శ్రీశైలం రిజర్వాయర్ గేట్ల సామర్థ్యం, నిర్వహణపై అధికారులు చర్చించారు. తుంగభద్ర నుంచీ వరద నీరు వస్తుండటంతో.. సుంకేశుల డ్యామ్ గేట్లను ముందుగానే ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. శ్రీశైలం నుంచి కూడా ఔట్ ఫ్లో ను పెంచే యోచనలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *