ఆర్థిక రంగ బలోపేతానికి చర్యలు తీసుకుంటామన్న ఆర్‌బీఐ గవర్నర్

ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ప్రభుత్వం కరోనావైరస్ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన తరువాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ ) గవర్నర్ శక్తికాంత దాస్ ఈ రోజు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టానికి తాజా చర్యలను ఆయన ప్రకటించారు. అంతేకాదు ప్రతీ అంశాన్ని, పరిణామాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నా మని,  సంబంధిత చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఇదే చివరి సమావేశం కాదని, ఈ ప్రక్రియ ఇకముందు కూడా కొనసాగుతుందని, కరోనా వైరస్ కు సంబంధించిన ప్రతీ అంశాన్ని పరిశిలీస్తూ, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా  అధిగమించేందుకు ఆర్‌బీఐ  అండగా వుంటుందని ఆయన  భరోసా ఇచ్చారు.  కరోనా ప్రభావం లేకుండా చూడడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.
కరోనా వైరస్ పరిస్థితిని చాలా దగ్గరగా పరిశీలిస్తున్నామనీ  ఆర్థిక వ్యవస్థను ఎప్పటికపుడు సమీక్షిస్తున్నామని శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా  24 గంటలూ  శ్రమిస్తూ విశేష సేవలందించిన  ఆర్‌బీఐ ఉద్యోగులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  బ్యాంకుల సేవలు కూడా ప్రశంసనీయమని పేర్కొన్నారు.  దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఏటీఎంలు  సమర్ధవంతంగా పని చేస్తున్నాయని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. 1930 తరువాత ఇంతటి సంక్షభాన్ని చూడలేదనీ, అయినా ఎటువంటి  పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామన్నారు. నాబార్డు , సిడ్బీ, ఎన్‌హెచ్‌బి వంటి ఆర్థిక సంస్థలకు రూ. 50 వేలకోట్ల ఆర్థిక సదుపాయాన్ని గవర్నర్ ప్రకటించారు. రివర్స్ రెపో రేటు  4 శాతం నుంచి  పావుశాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రస్తుత 3.75 శాతంగా వుంటుంది.  మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ రోజు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించనున్నారు. కాగా కోవిడ్ -19  సంక్షోభం కారణంగా  గత నెలలో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) ముందస్తు సమీక్షను చేపట్టిన  ఆర్‌బీఐ కీలక వడ్డీరేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.15 శాతం నుంచి 4.40 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.ప్రభుత్వం ఈ రోజు రూ. 20వేల కోట్ల బాండ్లను విక్రయించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *