మాజీ సీఎం జగన్‌కు జడ్ ప్లస్ భద్రత ఉన్నా అభద్రతా భావం ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. జగన్‌కు ప్రస్తుతం 58 మందితో భద్రత ఉందని ఎక్స్ వేధికగా లోకేష్ పేర్కొన్నారు. రెండు ఎస్కాట్ బృందాలతో పాటు 10 మంది సాయుధ గార్డులతో జగన్ భద్రత ఉందని అన్నారు. అంతే కాకుండా కాన్వాయ్‌లో రెండు అత్యాధునిక ల్యాండ్ క్రూజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయని తెలిపారు. ఇవి సరిపోక.. ఇంకా 986 భద్రత ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కుదించడాన్ని సవాలు చేస్తూ జగన్ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే మరో వైపు పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్ తులసి రెడ్డి జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్ 139 మంది గన్ మెన్లను అడుగుతున్నారని అది భద్రత కోసం కాదని స్టేటస్, ఆర్భాటం కోసమేనని ఆరోపించారు. ఈ సందర్భంగానే జగన్‌కు 59 మంది గన్‌మెన్లు చాలదా అని ప్రశ్నించారు. 139 మంది గన్ మెన్లతో భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇది జగన్ పిరికితనానికి దర్పణమని తెలిపారు. అయినా ప్రభుత్వం ఎమ్మెల్యేల లాగా జగన్ కూడా ఒక ఎమ్మెల్యేనే అని అన్నారు.
ఎమ్మెల్యేలకు 1+1 లేక 2+2 గన్ మెన్ల భద్రత మాత్రమే ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. అలాగే జగన్ కు కూడా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతే కాకుండా స్టేటస్ కోసం గన్ మెన్లను ఇవ్వడం సరికాదని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం జగన్ హైకోర్టు పిటిషన్ విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.