జనసేన, టీడీపీ దెబ్బకి దిగొచ్చిన జగన్.. కొత్త ప్లాన్ ఇదేనా?

ఓదార్పు యాత్రలతో జనంలో తిరుగుతూ జగన్ వైసీపీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. మధ్యలో జైలు జీవితం గడిపినప్పటికీ తర్వాత కూడా ప్రజల్లో ఉండటానికే ప్రాధాన్యతిచ్చారు. అధికారంలోకి రావడానికి సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఎప్పుడైతే సీఎంగా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి ప్రజలకు పూర్తిగా దూరమైపోయారు. తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమై పరదాల మాటున పాలన సాగించారు. అది కూడా ఆయన ఘోరపరాజయానికి ఒక కారణమైందంటారు. అలాంటి జగన్ ఇప్పుడు తిరిగి పార్టీని గాడిలో పెట్టడానికి దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారా? నిజంగానే జగన్ వ్యవహారశైలిలో మార్పు వస్తుందా?

 

తండ్రి మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవి దక్కలేదని కాంగ్రెస్‌తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న జగన్.. మొదట్లో ఓదార్పు యాత్రలంటూ జనంలోనే ఉన్నారు. 2012లో కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన 18 మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ అనర్హత వేటు వేశారు. తర్వాత ఆ 18 స్థానాలకు జరిగిన బైపోల్స్‌లో వైసీపీ 15 చోట్ల విజయం సాధించి అసెంబ్లీలో బలం పెంచుకుంది. అయితే ఆ బైపోల్స్ ప్రచారంలో ఉన్నప్పుడే అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అవ్వడం ఆయనకు ఆ ఎన్నికల్లో కలిసి వచ్చిందన్న వాదన ఉంది. బైపోల్స్ విజయంతో పెరిగిన ధీమాతో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ చాలా కాన్ఫిడెన్స్‌తో కనిపించారు. అప్పటికి 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన ఆయన కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై తండ్రి లేని బిడ్డనైన తనను అరెస్ట్ చేయించాయని ఎన్నికల్లో సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారు. అయితే అధికారానికి ఆమడదూరంలోనే ఉండిపోయారు. ఆ క్రమంలో 2019 ఎన్నికల ముందు సుదీర్ఘ పాద్ర చేసి ప్రజల్లోనే ఉంటూ.. పవర్‌లోకి వచ్చిన ఆయనలో స్పష్టమైన మార్పు కనిపించింది.

 

151 సీట్లతో అధికారంలోకి రావడంతో అధికారం శాశ్వతమన్న ఫీలింగ్ జగన్‌లో వ్యక్తమైంది. పార్టీని పట్టించుకోకుండా, ప్రజలకు కూడా పెద్దగా కనిపించకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచే అయిదేళ్లు పాలన సాగించారు. 2012 నుండి 2019లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు నిత్యం ప్రజల్లోనే ఉన్న వైసీపీ అధ్యక్షుడు 2019 నుంచి 24 వరకు అటు ప్రజలకి, ఇటు పార్ట నాయకులకి, ప్రజా ప్రతినిధులకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎలాగూ గెలుస్తామన్న ధీమాతో వైనాట్ వన్ సెవెన్టీ ఫైవ్ స్లోగన్ ఎత్తుకున్న జగన్‌ను ఆ ఓవర్ కాన్ఫిడెన్సే నిండా ముంచింది. కేవలం 11 సీట్లకు పరిమితం చేసింది.అధకారంలో ఉన్నంతకాలం పార్టీలో జగన్ చెప్పిందే వేదం అన్నట్లు నడిచింది. ఓటమి తర్వాత జగన్‌తో పాటు ఆయన చుట్టూ ఉన్న కోటరీనే దారుణ పరాజయానికి కారణమని వైసీపీ సీనియర్లు కూడా బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఆయన అతి ధీమానే అందర్నీ ముంచిందని పార్టీ నాయకులు అంటున్నారు. పలువురు మాజీ ఎమ్మెల్యేలు జగన్‌కు దణ్ణం పెట్టి వైసీపీని వదలి వెళ్లిపోతున్నారు.

 

జగన్‌కి వీరవిధేయుడిగా పేరున్న మాజీ మంత్రి పేర్ని నాని లాంటి వాళ్లు కూడా జగన్ హయాంలో సీఎంఓ సక్రమంగా నడవలేదని దెప్పిపొడుస్తున్నారు. జగన్ ప్రజలకి, కార్యకర్తలకి అందనంత దూరంలో ఉండటం వల్లే పార్టీకి ఈ దుస్థితి దాపురించిందని విమర్శిస్తున్నారు. ఇక ఓటమి తర్వాత కూడా జగన్ అదే పంధా కొనసాగించారు. అటు అసెంబ్లీలో కనిపించకుండా.. నిత్యం బెంగళూరు టూర్లు పెట్టుకుంటూ.. పార్టీ నేతలకు పెద్దగా అందుబాటులో లేకుండా పోయారు. ఇటు చూస్తే అద్భుత విజయం తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రజలతో మరింత మమేకం అవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌లు ప్రజాదర్బార్‌లతో జనానికి అందుబాటులో ఉంటున్నారు. మరోవైపు టీడీపీ ముఖ్య నేతలు, మంత్రులు పార్టీ కార్యాలయాల్లో ప్రతిరోజు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తూ.. వాటి పరిష్కారానికి క‌ృషిచేస్తున్నారు. జనసేన కార్యాలయంలో కూడా ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ నిత్యం అందుబాటులో ఉంటున్నారు.

 

కూటమినేతల వ్యవహారంతో జగన్ డైలమాలో పడినట్లు కనిపిస్తున్నారు. ఇక ఆయన కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనకు వచ్చారంటున్నారు. తాడేపల్లి లో ఉన్నప్పుడు వారంలో రెండు రోజులు పాటు కార్యకర్తలకి నాయకుల్ని కలవాలని నిర్ణయం తీసుకున్నారంట. ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారి తాజాగా తాడేపల్లి ప్యాలెస్ లో కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు జగన్

 

కార్యకర్తలకి నేతలకి అందుబాటులో లేకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదన్న.. వాస్తవం మాజీ ముఖ్యమంత్రికి ఇప్పటికి బోధపడినట్లు కనిపిస్తుంది. కార్యకర్తలు, ప్రజలకు చేరువ అవ్వడానికి జగన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుండటంతో వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటే 2029 ఎన్నికల్లో విజయావకాశాలు ఉంటాయని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కూటమి నేతలు గెలిచిన తర్వాత ప్రజలకు మరింత అందుబాటులో ఉంటుంటే.. ఓడిపోయిన వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ సీనియర్లు కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. దాంతో తానే రంగంలో దిగి కార్యకర్తలతో మమైకం కావాలని జగన్ భావిస్తున్నారంట. ఆ క్రమంలో తన బెంగళూరు ప్యాలెస్‌ను మర్చిపోలేక పోతున్న ఆయన వారంలో మూడు రోజులు తాడేపల్లిలో నాలుగు రోజులు బెంగళూరులో ఉండేలా కార్యాచరణ రెడీ చేసుకుంటున్నారంట.

 

తాడేపల్లిలో ఉండే మూడు రోజుల్లో రెండు రోజులు క్యాంపు కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలను కలుస్తారంట.. ఇప్పటికే వైసీపీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీల, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు.. కూటమి పార్టీల గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయా? అని ఎదురుచూస్తున్నారు. వారిని కాపాడు కోవడం కోసమే జగన్ తన స్టైల్ మార్చాలని అనుకుంటున్నారంట. మొత్తానికి చారిత్రాత్మక ఓటమితో జగన్‌కు తత్వం భోధపడినట్లు కనిపిస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. మారితే భవిష్యత్తు ఉంటుంది లేకపోతే పార్టీని మర్చిపోవాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజా మళ్లీ బెంగళూరు వెళ్లిపోయిన జగన్‌లో నిజంగా పార్టీ నేతలు ఆశపడుతున్న మార్పు వచ్చిందో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *