విమాన ప్రయాణ సమయంలో లగేజీ మిస్ అవ్వడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సెలబ్రిటీల విషయంలో ఇలా జరిగితే.. అధికారులు వారి సామగ్రిని వెతికి పట్టుకొని అప్పగిస్తారు. సాధారణ ప్రజలకు ఈ పరిస్థితి తలెత్తితే మాత్రం పట్టించుకునేవారు ఉండరు. తాజాగా ఒక వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరంగా మారిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లగేజీ నుంచి మిస్ అయింది. ఎయిర్‌పోర్ట్‌లో మిస్ అయిన ఆ ప్యాకేజీ ఐపీఎల్ జట్టు లగేజీలో చేరడం విశేషం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో ఉన్న ఒక వ్యక్తి ఆరోగ్యం బాగాలేదు. అతడికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అవసరం అయింది. దీంతో బెంగళూరులో ఉన్న వ్యక్తి ఒకరు దాన్ని కొనుగోలు చేసి, ఇండిగో ప్లైట్ పార్సిల్లో ఢిల్లీకి పంపించారు. కానీ అది ఆ ఫ్లైట్‌లో కాకుండా, రెండు రోజుల తర్వాత గమస్థానానికి చేరింది. ఈ సోమవారం నాడు ప్యాక్ చేసిన పార్సిల్ బుధవారం నాటికి కానీ చేరలేదు. ఈ మధ్యలో ఏం జరిగింది అనేదే ఇక్కడ ఆసక్తికరమైన అంశం.
ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల అన్సారీకి ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. అతడికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో అన్వర్ అనే వ్యక్తి బెంగళూరులో ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను కొని ఇండిగో 6ఈ 5161 విమానంలో చెక్ఇన్ బ్యాగేజీగా పంపించాడు. సోమవారం రాత్రి విమానం దిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అయితే కాన్సన్ట్రేటర్ ఉన్న కార్టన్ బాక్స్ ఆ విమానం లగేజీలో లేదు. దీంతో అన్వర్ ఇండిగో సిబ్బంది ఆరా తీశారు. సిబ్బంది రెండు రోజులు విచారణ చేసి అసలు విషయం గుర్తించారు. ఈ నెల 27న రాత్రి ఐపీఎల్ క్రికెటర్ లగేజీలో ఆ బాక్స్ కలిసిందని గుర్తించారు. దీంతో ఇండిగో సిబ్బంది వెళ్లి ఆ ఆటగాడి నుంచి బాక్స్ స్వాధీనం చేసుకున్నారు.
అయితే కాన్సన్ట్రేటర్ బాక్స్ ఎలా మిస్ అయ్యింది అనే విషయంలో సరైన స్పష్టత లేదు. ఈలోపు అన్సారీకి ఆక్సిజన్ స్థాయి ఇంకా పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయంపై ఇండిగో ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. ఆ బాక్స్‌ను ఎవరో ఒక వ్యక్తి కన్వేయర్ బెల్ట్ నుంచి తీశాడని, ఆ తర్వాత వేరే బ్యాగేజీతో కలిపేశాడని ఆ సంస్థ ప్రకటించింది. ఆ తరువాత బాక్స్ చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్‌కు చెందిన ఒక క్రికెటర్ లగేజీతో కలిసింది. ఆ జట్టు సభ్యులు విస్తారా విమానంలో ఢిల్లీ వచ్చారు. రెండు విమానాల లగేజీ కలవడం అంత సులభం కూడా కాదు. ఇక్కడ ఏం జరిగిందనే వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. కానీ ఈ పార్సిల్ ఆలస్యం కావడం వల్ల ఆ పెద్దాయన ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఐతే ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.