ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరక్కుండా చూడండి: కేసీఆర్‌

హైదరాబాద్‌: దేశంలోని పలు ప్రాంఆల్లోని ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలుచోటు చేసుకుంటున్న నేపధ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వైద్య , ఆర్యోశాఖ అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అగ్నిమాపక వ్యవస్ధను సమీక్షించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా కు చికిత్స తీసుకుంటున్న వారు భారీగా ఉన్నారని అన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగితే తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అసలే ఎండా కాలం కావడం, రోగులు ఎక్కువ ఉన్న ఆస్పత్రుల్లో భారీగా విద్యుత్‌ వినియోగం పెరుగుతుందని ఈనేపధ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని, అన్ని ఆస్పత్రుల వద్ద అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచాలని అన్నారు.

అలాగే కరోనా పరీక్షలకు వచ్చే వారికి కరోనా నిర్ధారణ పరీక్ష కిట్స్‌ కొరత లేకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రపంచంలో ఎక్కడ అందుబాటులో ఉన్నా వాటిని రాష్ర్టానికి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. యుద్ధ విమానాల ద్వారా తీసుకు వస్తున్న ఆక్సీజన్‌ను అవసరం ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రికి అందే విధంగా సమన్వయం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కరోనాతో హోం ఐసోలేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఐసోలేషన్‌ కిట్స్‌ అందే విధంగా చూడాలని కూడా సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్న వారిని ఎప్పటికప్పుడు మానిటర్‌ చేయాలని కూడా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *