పండ్ల మార్కెట్‌ తరలింపుపై సమావేశం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ :  ఈ నెల 23 వరకు కొత్తపేట పండ్ల మార్కెట్‌ తెరిచే ఉంటుందని.. 27న కోహెడలో నూతన పండ్ల మార్కెట్‌ ప్రారంభమవుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కొత్తపేట పండ్ల మార్కెట్‌ తరలింపుపై అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మంచి రెడ్డి కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ గా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న కోహెడ మార్కెట్ కు ఈ మామిడి సీజన్‌లో తరలించడం వల్ల వ్యాపారులు, ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నిత్యం వేలాది వాహనాలు కొత్తపేట మార్కెట్‌కు రావడం వల్లన తీవ్ర సమస్య ఏర్పడుతుందని.. కరోనా వైరస్‌ను అరికట్టడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
సామాజిక దూరం పాటించకుండా..వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వల్ల కరోనా వ్యాప్తి నియంత్రణకు విఘాతం కలుగుతుందని మంత్రి తెలిపారు. కోహెడలో 170 ఎకరాల స్థలం కేటాయించడంతో భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా 5 ఎకరాల స్థలంలో యుద్ధప్రాతిపదికన 132 కేవీ సబ్‌స్టేషన్ కూడా మంజూరవుతుందన్నారు. రోడ్లు, మంచినీటి పనులను కూడా వెంటనే ప్రారంభించాలని మంత్రి కోరారు. మామిడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కరోనా ప్రభావం నేపథ్యంలో  మార్కెట్‌ తరలింపునకు ప్రతిఒక్కరూ  అధికారులకు సహకరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *