ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తరువాత రాజకీయ నాయకుల కిలాడీ లీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అధికారం అడ్డం పెట్టుకున్న కొందరు నాయకులు ప్రభుత్వ భూములు కొట్టేశారని అనేక జిల్లాల్లో వెలుగు చూసింది. అయితే వక్ఫ్ భూములను ఆక్రమించిన కొందరు నాయకులు ఆ భూములను ఫ్లాట్లుగా చేసి ఇతరులకు విక్రయించేశారని వెలుగు చూడటం కలకలం రేపుతోంది.
వందల కోట్ల రూపాయల వక్ఫ్ భూములను కొందరు నాయకులు భాగాలు పెట్టుకుని అమ్ముకున్నారని, అవినీతి అధికారులు ఆ భూములను కొందరి పేర్లతో రిజిస్టర్ చేశారని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కర్నూలు సిటీ పరిధిలోని వందల కోట్ల రూపాయల విలువైన భూములను కొందరు రాజకీయ నాయకులు, రెవెన్యూ శాఖ అధికారులు, జిల్లా మైనారిటీ, సంక్షేమ శాఖ, వక్ఫ్ బోర్డు అధికారులు కలిసి అందరూ కుమ్మక్కు అయ్యి వక్ఫ్ భూమలను గోల్ మాల్ చేశారని వెలుగు చూసింది.
గత వైసీపీ ప్రభుత్వంలోనే ఇంత జరిగిందని వెలుగు చూడటంతో ఆ ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కర్నూలు సిటీ పరిధిలోని నంద్యాల చెక్ పోస్టు నుంచి పుల్లారెడ్డి కాలేజ్ కు వెళ్లే మార్గంలో జొహరాపురం గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 154లో వక్ఫ్ బోర్డుకు చెందిన 12.59 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూములు వక్ఫ్ భూములు అని కర్నూలు సిటీలోని రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు అందరికి తెలుసు.
ఆ ప్రాంతంలోని ప్రైవేటు భూములు ఎకరా రూ. 9 కోట్లకు పైగా ఉందని ప్రజలు అంటున్నారు. అంటే వక్ఫ్ బోర్డుకు చెందిన భూములు విలువ సుమారు వంద కోట్ల రూపాయలకు పైగా ఉంది. అయితే గత ఐదు సంవత్సరాల్లో ఈ 12 ఎకరాల భూములను చాలా మంది కబ్జా చేశారని వెలుగు చూసింది. వక్ఫ్ భూములు రక్షించాల్సిన సంబంధిత అధికారులు కబ్జా దారులకు, రాజకీయ నాయకులకు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.
కొందరు భూములు కబ్జా చేసి కాంపౌండ్ కట్టుకున్నారని, కొందరు వాటిని ఫ్లాట్లు చేసి ఇతరులకు విక్రయించారని, కొందరు పక్కా ఇండ్లు నిర్మించి ఆ ఇండ్లు ఇతరులకు విక్రయించారని, ఇంకా కొందరు తాత్కాలిక షెడ్లు వేసుకుని వారి ఆధీనంలోనే పెట్టుకున్నారని వెలుగు చూసింది. ఈ వ్యవహారం మొత్తం తెలిసిన గ్రామ స్థాయి, మండల స్థాయి అధికారులు సైతం కబ్జాదారులకు పూర్తిగా సహకరించారని, అధికారుల సహకారంతో కబ్జాదారులు ఇంకా రెచ్చిపోయారని వెలుగు చూసింది.
ఇటీవల కర్నూలు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిగా సునీల్ కన్నా బాధ్యతలు స్వీకరించారు.. కర్నూలుకు చెందిన కొందరు నాయకులు వక్ఫ్ భూముల కబ్జా వ్యవహారం గురించి సునీల్ కన్నా వరకు తీసుకెళ్లారు. తాను ఇటీవలే అధికారం స్వీకరించారని, ఈ విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. వక్ఫ్ భూములకు సర్వే నెంబర్ లేకపోయినా పక్క సర్వే నెంబర్ కు మరో అంకె తగిలించి చాలా మందికి రిజిస్ట్రేషన్లు చేయించారని వెలుగు చూసింది.
తరువాత ఇవి వక్ఫ్ భూములు అని తెలుసుకుని భయపడిన కొందరు వాటిని తక్కువ ధరకు వేరే వాళ్లకు విక్రయించారని వెలుగు చూసింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత కర్నూలు సిటీలో వందల కోట్లు భూములు ఎవరెవరు కబ్జా చేశారు అని పూర్తి సమాచారం బయటకు లాగి నిందితుల మీద కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తామని కర్నూలుకు చెందిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు అంటున్నారు.