అమ్మకు వందనం అమలుపై ప్రభుత్వం తాజా ప్రకటన..!

ఏపీ ప్రభుత్వం అమ్మకు వందనం పైన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.అధికారంలోకి వస్తే ఎంత మంది పిల్లలు చదువుకుుటున్నా వారికి తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికి రూ 15 వేలు చొప్పున తల్లికి అందిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ప్రస్తావించిన అంశాల్లో ఒక్క విద్యార్ధికే వర్తిస్తుందనే విధంగా ఉండటంతో వివాదం మొదలైంది. తాము ఈ పథకానికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని ప్రభుత్వం చెప్పగా..ఇప్పుడు మంత్రి రామానాయుడు మరింత స్పష్టత ఇచ్చారు.

 

అమ్మకు వందనం పథకంపై అబద్దపు ప్రచారాలు జరుగుతున్నాయని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట తప్పే వ్యక్తి జగన్ రెడ్డి అని, ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని నిమ్మల చెప్పుకొచ్చారు. ఆ పథకంపై ఇంకా విధివిధానాలు రూపొందించక ముందే “అమ్మకు వందనం మంగళం” అంటూ ప్రచారాలు చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటుందని, ప్రతి బిడ్డకూ దీన్ని అమలు చేసి తీరుతామని ఉద్ఘాటించారు.

 

ఎన్నికల హామీ మేరకు పెంచిన వెయ్యి రూపాయల పింఛన్‌ను ఐదు రోజుల్లోనే ఇంటికి తెచ్చి ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి నిమ్మల చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వానికి వెయ్యి రూపాయలు పెంచేందుకు ఐదేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో అమ్మఒడి పేరుతో అమ్మలను మోసం చేశారని, వారికి ఇవ్వాల్సిన నగదులో కోతలు పెట్టారని ధ్వజమెత్తారు. ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఇసుకపై అసత్యాలు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతల దాడిని ప్రజలే తిప్పికొట్టారని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంపై ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని, లేదంటే ఈసారి ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కు పరిమితం కావడం ఖాయమని ఉద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *