ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్, జగన్‌పై కేసు నమోదు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వణికిపోతున్నారు. ఏ రోజు ఎలా ఉంటుందోనని బెంబేలెత్తుతున్నారు. రాజకీయ నేతలు ఎవరు తమపై కేసులు పెడతారేమోనని కంగారుపడుతున్నారు. డ్యూటీకి వస్తున్నా టెన్షన్ మాత్రం అనుక్షణం ఆయా అధికారులను వెంటాడుతోంది. అధికారం చేతులో ఉందని ఇష్టానుసారంగా వ్యవహరించారు.

 

గత ప్రభుత్వంలో తమకు ఎదురులేదని భావించారు కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు. అధికారాలను ఫుల్‌గా వాడేశారు. నేతలపై వేధింపులు, టార్చర్, కేసులు పెట్టి ఎంజాయ్ చేశారు. ఒకవేళ నేతలు ప్రశ్నిస్తే.. అదివారి హక్కు అంటూ వైసీపీ నేతలను వెనకేసుకొచ్చేవారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయని అనుకున్నారు. అప్పటి సీఎం జగన్ కూడా అధికారులను బాగానే వినియోగించుకున్నారు. ఇప్పుడు అడ్డంగా బుక్కైపోతున్నారు.

 

తాజాగా ఏపీ మాజీ సీఐడీ చీఫ్, ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్ బుక్కైపోయారు. ఆయనపై గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్‌పై టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని అందులో పేర్కొన్నారు సదరు ఎమ్మెల్యే.

 

టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి సీఎం జగన్, ఐపీఎస్ అధికారులు సునీల్‌కుమార్, సీతారామాంజనేయులు, విజయపాల్, గుంటూరు సూపరింటెండెంట్ పాత్ర ఉందన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను సమర్పించారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

 

మూడేళ్లు కిందట మే 14న హైదరాబాద్‌లో అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో కస్టడీలో ఉన్న తనను టార్చర్ పెట్టారని వివరించారు. జగన్‌ను విమర్శిస్తున్నందుకు చంపేస్తామని ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్ నేరుగా బెదిరించారని అందులో పేర్కొన్నారు.

 

చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్, ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌ప్రకాష్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు ఉన్నారు. మరికొందరు అధికారులు అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. చాలామంది అధికారులకు ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వలేదు. ఈ క్రమంలో రాజీనామాలు చేయాలని భావిస్తున్నట్లు సచివాలయం సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *