భారత దేశంలో ప్రాచీన ఆలయాలకు కొదవే లేదు. దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయాలలో ఒకటిగా చెప్పుకునే పూరీ జగన్నాథ్ ఆలయం. లక్షలలో తరలి వచ్చే పూరీ జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా ఉంటుంది. ఒడిశా రాష్ట్రానికే తలమానికంగా నిలిచే ఆలయం పూరీ జగన్నాథ్ ఆలయం. 12వ శతాబ్దంలో రాజా అనంత వర్మ చోడగంగదేవ్ ఈ ఆలయ నిర్మాణం మొదలు పెట్టారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర చెక్క విగ్రహాలు దర్శనమిస్తాయి. విశిష్టతలు కలిగిన వైష్ణవాలయాలలో పూరీ జగన్నాథ్ ఆలయం ఒకటి.
నాలుగు దశాబ్దాల తర్వాత
కేరళ లోని అనంత పద్మనాభ స్వామి ఆలయం లాగానే పూరీ జగన్నాథ ఆలయంలో ఓ రత్న భాండాగారం ఉంది. అందులో అపారమైన నగలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే 40 సంవత్సరాల క్రితం ఈ రత్నభాండాగారం తెరిచినట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఎట్టకేలకు ఈ ఆలయ రత్న భాండాగారం తెరిపించాలని పట్టుబట్టడంతో దాదాపు 4 దశాబ్దాల తర్వాత పూరీ జగన్నాథ ఆలయంలో ఈ భాండాగారం జులై 14 ఆదివారం తెరుచుకోనుంది. అయితే పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ మహత్తర కార్యక్రమం జరుగనుంది. అయితే ఈ భాండాగారానికి సంబంధించిన తాళం దాదాపు 50 ఏళ్ల క్రితమే పోయింది. ఇంతవరకూ దాని ఆచూకీ కూడా లభ్యం కాలేదు. అందుకే డూప్లికేట్ తాళంతో తీసేందుకు యత్నిస్తామని పురావస్తు అధికారులు చెబుతున్నారు. దాని వలన కూడా కాకపోతే తప్పనిసరి పరిస్థితిలో తాళం బద్దలు కొడతామని చెబుతున్నారు.
ఆది శేషుడి నగలుగా ప్రచారం
ఈ రత్నభాండాగారం గురించి కథలుకథలుగా చెబుతారు. ఇవి సాక్షాత్తూ ఆదిశేషుడి నగలని అక్కడి స్థానికుల నమ్మకం. ఎందుకంటే ఈ నిధి ఉన్న గదిలో పాము బుసలు వినిపిస్తాయని అంటున్నారు. అంటే సాక్షాత్తూ ఆ వేయిపడగల ఆదిశేషుడు తన సంపద కాపాడుకోవడానికి పాములను కాపలాగా పెట్టాడని చెబుతున్నారు అక్కడి భక్తులు. అందుకే గది తెరిచే ముందు పాములను పట్టేవాళ్లను కూడా తీసుకెళుతున్నారు అధికారులు.అయితే ఇందులో నగలు, మణిమాణిక్యాలు అన్నీ సేఫ్ గా ఉన్నాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆలయానికి వచ్చే భక్తులు, రాజులు స్వామివారికి ఇచ్చిన వజ్ర, బంగారు అమూల్య కానుకలు ఉన్నాయని వీటిని వెలకట్టలేమని అంటున్నారు స్థానిక భక్తులు. ఎప్పటినుంచో ఈ భాండాగారాన్ని తెరవాల్సిందని ప్రజలనుంచి అభ్యర్థనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నలభై ఏళ్ల తర్వాత దీనికి మోక్షం లభించినట్లయింది.
మోదీ చేసిన విమర్శలతో..
మొన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో ఒడిశా బహిరంగ సభలో పాల్గొన్న మోదీ పూరీ జగన్నాథ్ ఆలయంలోని రత్న భాండాగారం గురించి ప్రస్తావించడం గమనార్హం. పైగా అప్పటి ఒడిశా రాష్ట్ర సర్కార్ పై మోదీ తీవ్రస్థాయిలో ధ్వజం ఎత్తారు. రత్నభాండాగారం విషయంలో తాత్సారం ఎందుకు చేస్తున్నారు? దీని వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరికి ప్రయోజనం కలగాలని ఈ భాండాగారాన్ని తెరవడం లేదో అర్థం కావడం లేదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీ చేసిన విమర్శలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి.ప్రతినిత్యం దేశవిదేశాల నుంచి ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. రథయాత్ర సమయంలో లక్షలాది భక్తులు తరలి రావడం విశేషం. 56 రకాల ప్రసాదాలతో స్వామి వారికి అర్చన చేయడం విశేషం. పైగా ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండలలోనే వండటం మరో విశేషం.