విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం : సీఎం చంద్రబాబు..

ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన పోలవరం ఎడమకాలువ పనులను, అక్విడెక్ట్ ను పరిశీలించారు. అనంతరం దార్లపూడిలో మాట్లాడుతూ.. గోదావరి జిల్లాల తర్వాత కూటమికి ఉత్తరాంధ్రలోనే అత్యధిక మెజార్టీ వచ్చిందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనివ్వబోమని, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తెలిపారు. రాక్షస పాలనను అంతమొందించేందుకు కూటమిని గెలిపించిన ఓటర్లు.. ఎన్నికలు అయ్యాయని ఇళ్లకే పరిమితం కావొద్దని, అబద్ధాలు చెప్పిన వైసీపీ నేతల్ని తిరగకుండా చేయాలని సూచించారు.

 

పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం రూ.800 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. సుజల స్రవంతితో ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి అన్న సంకల్పంతోనే పని చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చేసే పనులు ఏ విధంగా జరుగుతున్నాయో.. ప్రజలంతా గమనించాలన్నారు. ప్రజల శ్రేయస్సే.. తమ అభిమతమన్నారు. ఈరోజు రోడ్లను చూస్తే.. చాలా అధ్వాన్నంగా ఉన్నాయని, ఆ గుంతలన్నింటినీ పూడ్చాల్సి ఉందన్నారు.

 

కూటమి గెలుపుతో.. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్లు ఉందన్నారు. మొన్నటి వరకూ రాష్ట్రంలో కిమ్ పాలన జరిగిందని, కూటమి హయాంలో.. ప్రజలందరికీ సంతోషంగా జీవించే అవకాశం వచ్చిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *