హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఆస్పత్రిలో పడకలు దొరకక.. ఆక్సిజన్ లేక.. కరోనా రోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఏ చిన్న సాయం దొరికినా… ఎంతో ఊరట చెందుతున్నారు. తాజాగా పాతబస్తీలోని ఓ ఆలయ పూజారికి అలాంటి ఘటనే ఎదురైంది. 75 ఏళ్ల వయస్సున్న ఆయన.. గత శనివారం కరోనా బారిన పడ్డారు. దీంతో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అయితే ఆయన గురువారం తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే… ఎక్కడా పడకలు అందుబాటులో లేవని అన్నారు. దీంతో వాళ్లు స్థానిక ఎంఐఎం పార్టీ నాయకుడి సహాయంతో ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి తమ గోడును విన్నవించుకున్నారు. వెంటనే ఆయన స్పందించారు. శాలిబండలోని ఓ ఆసుపత్రిలో బెడ్ ఏర్పాటు చేయించారు. అసద్ ఉదారతకు ఆ కుటుంబం చలించిపోయింది. ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.