టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు..!

శాసనమండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీలకు అభ్యర్థులు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థులుగా ఎన్‌వీ‌ఎస్ఎన్ వర్మ, మరొకటి మహమ్మద్ ఇక్బాల్ దాదాపుగా ఓకే అయినట్టు సమాచారం. త్వరలో అభ్యర్థుల పేర్లను టీడీపీ ప్రకటించనుంది.

 

పిఠాపురంలో పవన్‌కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు మాజీ ఎమ్మెల్యే వర్మ. అంతేకాదు భారీ మెజారిటీతో జనసేన అధినేతను గెలిపించారాయన. ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట ఇచ్చారు. దీంతో వర్మకు సీటు ఖాయమైంది. మరొకటి హిందూపురంలో బాలకృష్ణ గెలుపు కోసం కృషి చేసిన ఇక్బాల్‌కు సీటు ఖరారైనట్లు పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.

 

ఎమ్మెల్యే కోటా కావడంతో ఈ రెండు స్థానాలను టీడీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. దీనికి సంబంధించి బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ రెండు వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. మూడున పరిశీలన.. ఐదున ఉప సంహరణకు అవకాశం ఉందని ఈసీ తెలిపింది. ఒకవేళ వైసీపీ గనుక రేసులో ఉంటే జూలై 12న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.

 

ఒకవేళ వైసీపీ నుంచి ఎవరూ రేసులో లేకుంటే ఏపీ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా అయ్యే ఛాన్స్ ఉంది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా మహ్మద్ ఇక్బాల్, సి. రామచంద్రయ్య ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీరిద్దరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్బాల్ తన పదవికి రాజీనామా చేశారు. రామచంద్రయ్యపై మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు. దీంతో రెండు స్థానాలు ఖాళీకావడంతో ఉప ఎన్నికలు అనివార్యమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *