ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపాలనలో వినూత్న మార్పులు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో ప్రజల వద్దకే వెళ్లి మరి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఏపీలోని గ్రామాల రూపు రేఖలు మార్చాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణ నీటి సరఫరా వంటి శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ తరుణంలో ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.
తాను చేపట్టిన శాఖలపై పవన్ కళ్యాణ్ ప్రజల సలహాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ తరుణంలో సూచనలు ఇవ్వాలనుకునే వారు క్యూఆర్ కోడ్, గూగుల్ ఫామ్ ద్వారా పంపవచ్చని పేర్కొన్నారు. దీని కోసం గూగుల్ ఫాం లింక్ https://forms.gle/8Y3rRtY1dewPQAyH7 ఇచ్చారు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి సలహాలు రాసి పంపాలని కోరారు.
ఈ మేరకు జనసేన ప్రకటన విడుదల చేసింది. క్యూఆర్ కోడ్, లింక్స్ కు సంబంధించిన వివరాలు ఎక్స్ ద్వారా షేర్ చేసింది. గూగుల్ ఫాంలో నింపాల్సిన వివరాలు కూడా పేర్కొంది. పేరు, ఫోన్ నెంబర్ సహా సలహాలు, సూచనలు పేర్కొనాలని వివరించింది. అంతేకాదు ఇందులో ఏ జిల్లా అనేది కూడా వివరాలు తెలిపి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏ శాఖలకు సూచనలు, సలహాలు ఇవ్వాలని అనుకుంటే ఆ శాఖ పేరుతో వివరంగా తమకు తోచిన సలహాలు ఇవ్వవచ్చని తెలిపింది. దీంతో పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ పనికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది.