18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతన లోక్‌సభకు ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ నేపథ్యంలో భర్తృహరి ఎంపికను ఇండియా కూటమి అభ్యంతరం వ్యక్తం చేసింది.
ప్రొటెం స్పీకర్‌గా అత్యంత సీనియర్ ఎంపీని ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా ఏడు సార్లు ఎంపీగా ఎన్నికైన భర్తృహరి మహతాబ్‌ను బీజేపీ ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకుంది. కాగా, ఈ ఎంపికను కాంగ్రెస్ తప్పుబట్టింది. ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికైన కాంగ్రెస్ నేత కె.సురేష్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించింది. భర్తృహరి వరుసగా ఏడు సార్లు ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ నేత సురేశ్ 1998, 2004 ఎన్నికల్లో ఓడిపోయారని, దీంతో ఆయనకు వరుసగా నాలుగో సభ అని బీజేపీ మంత్రి కిరెన్ రిజిజు పేర్కొన్నారు.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా కూటమి నేతలు రాజ్యాంగ ప్రతులతో పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు. అంతకుముందు పార్లమెంట్ పాత భవనం నుంచి కొత్త భవనం వరకు ర్యాలీ చేపట్టారు. రాజ్యాంగం ప్రతులను చేతిలో పట్టుకొని ప్రధాని మోదీ రాజ్యాంగానికి విలువ ఇవ్వడం లేదని నినాదాలు చేశారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించిన నిరసన చేపట్టినట్లు కూటమి సభ్యులు పేర్కొన్నారు. ప్రొటెం స్పీకర్ నియమించిన తీరు రాజ్యాంగ ఉల్లంఘనేనని నిరసన చేపట్టారు. అనంతరం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు.
ప్రొటెం స్పీకర్ ఎంపికకు నిరసనగా ఇండియా కూటమి ఎంపీలు సురేష్, బాలు, బందోపాధ్యాయలు సహకరించరని కాంగ్రెస్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏడుసార్లు ఎంపీగా గెలిచిన రమేష్ చందప్పని ఎందుకు ప్రొటెం స్పీకర్ చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు. అలాగే ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికైన సురేష్‌కు అవకాశం ఇవ్వకపోడానికి కారణం ఏంటని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.