నేడు రాష్ట్రానికి రానున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..

రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు, నేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీల అగ్రనేతలు ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. రోజుకు రెండు మూడు లేదా అంతకంటే ఎక్కువ సభలలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో అభ్యర్థుల గెలుపునకు తీవ్రంగా కృషి చేస్తుంది. సభలు, సమావేశాలు భారీగా నిర్వహిస్తుంది.

 

మొన్న ఎర్రవల్లిలో నిర్వహించిన జనజాతర సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే, నేడు కూడా రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ నిర్వహించే కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీతోపాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు పలువురు మంత్రులు, కీలక నేతలు, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పాల్గొననున్నారు.

 

ఇదిలా ఉంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలోని పలు సభలలో పాల్గొని బీజేపీ, బీఆర్ఎస్ పైతీవ్ర స్థాయిలో ఫైర్ అయిన విషయం తెలిసిందే. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని, బీజేపీ ఎక్కువ సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలని, రాజ్యాంగం మార్చాలని చూస్తుందని బీజేపీ నేతలే అంటున్నారని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఆశలు నెరవేరవు.. నెరవేరబోనియ్యమని తెలుపుతూ దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతున్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేసిన విషయం విధితమే.

 

ఇటు ప్రియాంకా గాంధీ కూడా దేశవ్యాప్తంగా ప్రర్యటిస్తూ కాంగ్రెస్ సభలు, సమావేశాలలో పాల్గొంటూ ప్రసంగిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఆమె ప్రజలను కోరుతున్నారు. గుజరాత్, కర్ణాటకలో నిర్వహించిన సభలలో ఆమె పాల్గొని మాట్లాడుతూ.. తన సోదరుడిని యువరాజు అని ప్రధాని మోదీ అంటున్నారని, తన సోదరుడు ప్రేద ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు బయటకు వచ్చి పాదయాత్ర చేశారని, కానీ, ప్రధాని మోదీ మాత్రం కోటలోంచి బయటకు రావడంలేదని.. ప్రజల కష్టాలను తెలుసుకోవడంలేదంటూ ఆమె కౌంటర్ ఇచ్చిన విషయం విధితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *