హైదరాబాద్ : ‘కరోనా వైరస్’.. తెలంగాణలో మార్చి 2న తొలి కేసు నమోదైంది , ఆ రోజునే. అక్కడితో మొదలై పదులు, వందల సంఖ్యలో బాధితులు దీని బారినపడ్డారు. ఏప్రిల్ 18 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 809 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తొలినాళ్లలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నా.. మర్కజ్ ఘటన తర్వాత తీవ్రత పెరిగి అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన తొలివ్యక్తిని మార్చి 2న గుర్తించారు. ఆ రోజు నుంచి ఈ 48 రోజుల్లో వైరస్ వ్యాప్తి ఎన్నో రెట్లు పెరిగింది. మొదటి కేసు నమోదైన తర్వాత రెండో కేసు నమోదుకు 12 రోజులు పట్టింది. మార్చి 14న రెండో కేసు నమోదు కాగా, అక్కడి నుంచి ప్రతి రోజు కేసుల నమోదు క్రమంగా పెరిగింది. అలా 24 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య 50కి పెరిగింది. కేసుల సంఖ్య ఒకటి నుంచి యాభై కావడానికి 24 రోజులు పడితే మరో 24రోజుల్లో 800 మార్కు దాటింది. మార్చి 31 నాటికి వంద కేసులు కాగా, ఏప్రిల్ 3కి ఈ సంఖ్య రెట్టింపై 233 అయ్యింది. మరో నాలుగు రోజుల్లో 400 దాటి.. ఈనెల 18 నాటికి 809 కేసులు నమోదయ్యాయి.
