ఎన్నడూ లేని విధంగా, ఊహించని స్థాయిలో ఇటీవలే చిన్న మొత్తాల పొదుపు పథకాల (స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్) వడ్డీ రేట్లు గణనీయంగా కోతకు గురయ్యాయి. దేశంలో వడ్డీ రేట్లు అత్యంత కనిష్టాలకు చేరడంతో కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల్లో వడ్డీ రేట్లను 2020–21 ఏప్రిల్–జూన్ త్రైమాసికి సవరించింది. ఇన్నాళ్లూ మెరుగైన వడ్డీ రేట్లతో చిన్న పొదుపు పథకాలు.. బ్యాంకు ఎఫ్‌డీలు, ఇతర స్థిరాదాయ పథకాలతో పోలిస్తే ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి. వడ్డీ రేట్లను పరిశీలించినట్టయితే వివిధ పథకాల్లో 0.7% నుంచి 1.40% వరకు తగ్గించడం జరిగింది. కాకపోతే పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాల డిపాజిట్లపై వడ్డీ రేటు 4%లో ఎటువంటి మార్పు చేయలేదు. రేట్లు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈ పథకాలను పెట్టుబడులకు పరిశీలించొచ్చా..? వీటిల్లో ఆకర్షణీయత ఇంకా మిగిలి ఉందా..? అన్న విషయమై నిపుణుల అభిప్రాయాల ఆధారంగా అందిస్తున్న ‘ప్రాఫిట్‌ప్లస్’ కథనం..
ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) రేటు ఎక్కువగా కోతకు గురైంది. ఇంతకుముందు వరకు 7.2 శాతం వడ్డీ రేటుతో ఈ పథకం ఆకర్షణీయంగా ఉండేది. తాజాగా 1.4 శాతం మేర తగ్గించడంతో 5.8 శాతానికి పరిమితమైంది. అలాగే ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టైమ్ డిపాజిట్లపై వడ్డీ రేటును కూడా 6.9 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించారు. ఐదేళ్ల టైమ్ డిపాజిట్ రేటు మాత్రం 7.7 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది. వృద్ధులకు నిలకడైన ఆదాయాన్నిచ్చే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్‌ఎస్)లోనూ వడ్డీ రేటును 8.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు 1.1 శాతం తగ్గి 7.9 శాతం నుంచి 6.8 శాతానికి దిగొచ్చింది. సుకన్య సమృద్ధి యోజనలో 7.6 శాతంగా ఉంది. ఇక ఎంతో ప్రాచుర్యం పొందిన పీపీఎఫ్‌లో వడ్డీ రేటు సవరణ తర్వాత 7.1 శాతంగా ఉంది. పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో 6.6 శాతానికి, కిసాన్ వికాస్ పత్రలో వడ్డీ రేటు 6.9 శాతానికి తగ్గిపోయింది.