ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ మరో షాకిచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వ అత్యవసర నిర్ణయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తాజా పరిస్దితులపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎన్నికల సమయంలో ఇకపై తీసుకునే ప్రతీ నిర్ణయం సమీక్షించాల్సిన పరిస్దితి ఎదురుకానుంది.
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి వచ్చేసింది. దీంతో ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న అత్యవసర నిర్ణయాల ప్రతిపాదనలు వివిధ శాఖల కార్యదర్శులు నేరుగా ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) లేదా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కి పంపేస్తున్నారు. దీంతో వీటి సీరియస్ నెస్ ఏంటన్నది వారికీ అర్దం కాని పరిస్దితి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కీలక ఆదేశాలు అందాయి. వీటి ప్రకారం సీఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం పంపే అత్యవసర ప్రతిపాదనలను నేరుగా స్వీకరించకుండా మధ్యలో వాటిని పరిశీలించేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ఓ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీలో ఈ ప్రతిపాదనలు పంపే శాఖల కార్యదర్శులతో పాటు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. వీరు ప్రభుత్వం నుంచి అందిన ప్రతిపాదనలని పరిశీలించి, వాటి అత్యవసరాన్ని వివరిస్తూ సీఈవోకు పంపాల్సి ఉంటుంది. అప్పుడు సీఈవో సీఈసీకి వాటిని పంపుతారు.