ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గుడివాడ రాజకీయాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని ప్రధానంగా స్థానికంగా చర్చ జరుగుతుంది.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి కొడాలి నాని ఎన్నికలలో పోటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలు తనకు చివరి ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు. 2029 ఎన్నికలకు తాను పోటీ చేసేది లేదని కొడాలి నాని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.గుడివాడ రాజకీయాలలో కీలక నేతగా నిత్యం చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను, నారా లోకేష్ ను టార్గెట్ చేసే నేతగా కొడాలి నానికి పేరు ఉంది.
వైసీపీలో కీలకంగా వ్యవహరించిన కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుడివాడ నుండి ఎమ్మెల్యేగా గెలిచి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఈసారి గుడివాడ టికెట్ కొడాలి నానికి కాకుండా, మండలి హనుమంతరావుకు ఇస్తారని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతున్న వేళ, మండలి హనుమంతరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ గుడివాడ పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.
ఎన్నికల్లో పోటీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని 2024 ఎన్నికలు తనకు చివరి ఎన్నికలని, 2029 ఎన్నికలలో తాను పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన వయసు 53 సంవత్సరాలని, 2029 కి మరో ఐదు సంవత్సరాలు కలిస్తే తన వయసు 58 ఏళ్లు అవుతుందని ఆ వయసులో మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయలేనని కొడాలి నాని ప్రకటించారు.
ఇక తన కుటుంబం నుండి ఎవరూ రాజకీయాల్లోకి రారని స్పష్టం చేసిన ఆయన, తన కుమార్తెలు ఎవరికి రాజకీయాల పట్ల ఆసక్తి లేదని వెల్లడించారు. ఒకవేళ ఆసక్తి ఉంటే తన తమ్ముడి కుమారుడు రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో కొడాలి నాని రాజకీయ వారసుడు ఆయన తమ్ముడి కుమారుడేనని ఆయన సన్నిహిత వర్గాలలో చర్చ జరుగుతుంది.